Telangana Rain Alert : తెలంగాణలో వర్షాల అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భీకర గాలులతో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వారంరోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- June 29, 2026 / 07:27 AM IST
Telangana Rain Alert
- తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు
- నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా ముందుకెళ్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. పలు జిల్లాల్లో భీకర గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు ఐఎండీ పేర్కొంది.
సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. ముఖ్యంగా అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
వర్షాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలు, గాలులు తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వర్షాలు, గాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముగులు జిల్లా ఏటూరునాగారంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
