Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వానలేవానలు.. హైదరాబాద్‌సహా ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..

Rain in telangana

Rain Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే, మరో నాలుగు రోజులు రాష్ట్రంలోని హైదరాబాద్ సహా నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు.. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలోనూ గురువారం తెల్లవారు జాము నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. వచ్చే నాలుగు రోజులు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవాళ (గురువారం) సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

శుక్రవారం (13వ తేదీ) నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం (14వ తేదీ) వరంగల్, మహబూబాబాద్, జనగాం, హనమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం (15వ తేదీన) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలోనూ భారీ వర్షాలు..
ఏపీలో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా త్వరలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈనెల 14 నుంచి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని, ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.