Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వానికి రైల్వేశాఖ కీలక ప్రతిపాదన
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 56 మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి.
- Harishth Thanniru
- Updated on- April 20, 2026 / 09:56 AM IST
Hyderabad Metro
- ఉదయం 5గంటల నుంచే మెట్రో రైళ్లు నడపండి
- తెలంగాణ ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన
- సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్
Hyderabad Metro : మెట్రో రైల్‌లో ప్రయాణించే వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6గంటల నుంచి అందుబాటలో ఉంటున్నాయి. అయితే, రానున్న రోజుల్లో పలు ప్రధాన రూట్లలో తెల్లవారుజామున 5గంటల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read : Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్.. నేడు రెండో విడత ‘రైతు భరోసా’.. నిధులు జమకాకుంటే వెంటనే ఇలా చేయండి..
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 56 మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రతిపాదనలు చేసింది. ఉదయం 5గంటల నుంచే మెట్రో రైళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఉదయం 5గంటల నుంచి ఆరు గంటల మధ్య హైదరాబాద్ కు ప్రధాన రైళ్లు చేరుకుంటున్నాయి. అదే సమయంలో వందే భారత్ లాంటి మరికొన్ని ముఖ్యమైన రైళ్లు నగరం నుంచి బయలుదేరుతున్నాయి. రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేవారు.. రైళ్లు ఎక్కేందుకు స్టేషన్లకు వచ్చేవారు కలిపి ఆ గంటలోనే దాదాపు 50వేల మంది ఉంటున్నారు. వీరిని గమ్యం చేర్చటం ఆర్టీసీ బస్సుల ద్వారా సాధ్యం కావడం లేదు. ఆ సమయంలో బస్సుల సంఖ్య నామమాత్రంగా ఉండటమే దీనికి కారణం. దీంతో ఉదయం 5గంటల నుంచే మెట్రో రైళ్లను నడిపితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొంది.
అయితే, దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనను సాకారం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఎందుకంటే.. మెట్రో రైళ్లు ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నడుస్తుంటాయి. ఆ తరువాత మెట్రో రైళ్లకు మెయింటెనెన్స్ పనులు నిర్వహించి తిరిగి ఉదయం ఆరు గంటలకు ట్రిప్పులు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఉదయం 6గంటలకు బదులు ఐదు గంటలకే ప్రారంభించాలంటే వాటి మెయింటెనెన్స్ పనులు ఓ గంట ముందే పూర్తి చేయాలి. కానీ, ఆలోపు మెయింటెనెన్స్ పనులు పూర్తి చేయటం అంత సులువు కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.
