Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్.. నేడు రెండో విడత ‘రైతు భరోసా’.. నిధులు జమకాకుంటే వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతు భరోసా పథకంకు సంబంధించి రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు.
Rythu Bharosa Scheme
- నేడు రెండో విడత రైతు భరోసా
- నిధులు జమ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
- రెండో ఎకరానికి అందనున్న నిధులు
Rythu Bharosa : వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.12వేలను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.
Also Read : MMTS Trains : హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ట్రైన్స్‌లో ఉచిత ప్రయాణం..
రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రబీ సీజన్లో పంట సాగుకు సంబంధించి ఎకరం, అంతకన్నా తక్కువ భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం తొలి విడతలో భాగంగా డబ్బులు జమ చేసింది. మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడతగా 1.50కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇవాళ రెండో విడత రైతు భరోసా నిధులను జమ చేయనుంది.
భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్లను విడుదల చేయనున్నారు. దీంతో రెండు విడతల్లో కలిపి రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయి. రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులు జమ కానున్నాయి. ఇక మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. అయితే, మూడో విడతలో మరో ఎకరానికి ఇస్తారా.. ఐదెకరాల వరకు పూర్తి చేస్తారా అనే స్పష్టత రావాల్సి ఉంది.
రైతు భరోసా అమలు కోసం ప్రతీ సీజన్ కు సుమారు రూ.9వేల కోట్ల చొప్పున ఏటా రూ.18వేల కోట్లు కావాలి. ఏ సీజన్లో అయినా ఏకమొత్తంగా చెల్లించాలంటే నిధుల సర్దుబాటు చాలా కష్టం. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడతల వారీగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
అయితే, ప్రస్తుతం రెండో విడతలో రైతు భరోసా నిధులు జమ కాని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అర్హత కలిగి ఉన్న రైతులు భూమి పట్టా, సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు లేదంటే రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా అర్హత కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ అవుతాయి.
