Ponguleti SrinivasReddy: పాత ఇళ్లకు పట్టాలు.. 7 లక్షల మందికి శుభవార్త.. పెండింగ్ పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకుని పట్టాల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 7 లక్షల మంది పేదలకు తెలంగాణ ప్రభుత్వం(Ponguleti SrinivasReddy) గుడ్ న్యూస్ చెప్పింది.
- V Santhosh Kumar
- Published on- November 17, 2026 / 11:09 AM IST
Minister ponguleti srinivas key comments to distribute pending house pattas to 7 lakh beneficiaries
Ponguleti SrinivasReddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో వివిధ ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు కట్టుకుని, దశాబ్ద కాలంగా తమ ఇళ్ల పట్టాలు (పొజిషన్ సర్టిఫికెట్లు) చేతికి అందక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు వాటిని తిరిగి అందజేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti SrinivasReddy) ప్రకటించారు. పేదల సొంతింటిపై శాశ్వత హక్కును పదిలం చేస్తూ ఆయా కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుందని మంత్రి స్పష్టం చేశారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో పట్టాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కదలిక:
ఇటీవల రాష్ట్రంలో 22-ఏ భూముల అంశంపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమీక్షల్లో, వేలాది మంది పేదల ఇళ్ల పట్టాలు మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పట్టాలను వెంటనే అసలైన లబ్ధిదారులకు తిరిగి అందజేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు.
తనఖాలో ఉన్న పట్టాలకు విముక్తి.. లబ్ధిదారుల్లో హర్షం:
2014 కంటే ముందు అమలైన గృహనిర్మాణ పథకాల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ రాయితీతో పాటు బ్యాంకు రుణాలు అందించేవారని, ఆ రుణాలకు ష్యూరిటీగా లబ్ధిదారుల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం వద్ద తనఖా ఉంచుకునేవారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో, రుణాలు తీర్చినా లక్షలాది మందికి పట్టాలు అందకుండా నిలిచిపోయాయని, ఇప్పుడు వాటన్నింటినీ పేదలకు అందిస్తున్నామని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
