Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. అతి పొడవైన సొరంగ మార్గం పూర్తైతే నల్గొండ జిల్లాకు తాగు సాగునీరు అందించవచ్చన్నారు. 2026 చివరి నాటికి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు.
3న హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానుందని.. ఆ రోజున కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందుకే నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం జరిగిందన్నారు. ఆ రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆర్డినెన్స్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ తెస్తామని, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామన్నారు. 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే పదేళ్లకు విద్యుత్ అవసరాల మేరకు బ్యాటరీ ఎనర్జీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
* SLBC టన్నెల్ పనులు వేగంగా పూర్తి చేస్తాం.
* 2026 చివరి వరకు ఈ టన్నెల్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.
* నవంబర్ 7న మరోసారి కేబినెట్ పెట్టి స్థానిక ఎన్నికల నిర్వాహణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాం.
* ఇద్దరు పిల్లల నిబంధన తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం.
* నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం.
* అల్వాల్, సనత్ నగర్, ఎల్బీనగర్ టిమ్స్.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.
* ప్రపంచంలోనే పొడవైన ఎస్ఎల్ బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మిగిలిన సొరంగం పనులను అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని నిర్ణయం.
* గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని నిర్ణయం.
* ఇప్పటివరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కేబినెట్ అనుమతించింది.
* అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ముందుకొచ్చింది. అదే కాంట్రాక్ట్ కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి.
* మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించింది.
* 2028 జూన్ నాటికి ఎస్ఎల్ బీసీని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకుంది.
* బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
* స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం.
అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించేందుకు కేబినెట్ ఆమోదం.
* అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
* ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైలును గవర్నర్ కి పంపేందుకు మంత్రివర్గం ఆమోదం.
* రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని కేబినెట్ చర్చించింది.
* వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ నగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
* రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం. ఈ నిర్మాణలను ఎక్కడ చేపట్టాలనే దానిపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది
* రామగుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (RTS-B 62.5 మెగావాట్ల యూనిట్) కాల పరిమితి ముగిసినందున దాన్ని తొలగించేందుకు కేబినెట్ ఆమోదం.
* రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్తు డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను క్యాబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని సూచించింది.