Ponguleti On Sada Bainama : సాదాబైనామా రైతులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి

Ponguleti On Sada Bainama : తెలంగాణలో సాదాబైనామా రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు.

minister ponguleti srinivas reddy said go 76 issued for sada bainama problems

Ponguleti On Sada Bainama : తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామా సమస్యపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్షలాది సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందన్నారు. ఇందుకోసం జీవో 76ని విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.

సాదాబైనామా సమస్యపై ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం.. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో వీటికి ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో సాదాబైనామా సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందన్నారు.

అయితే ప్రారంభంలో ఈ సమస్య పరిష్కారం కోసం.. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన వల్ల.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం కోసం.. ఇప్పటి నుంచి కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు జీవో 76ను విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. త్వరలోనే వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందన్నారు.