Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంపు..! మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారవుతోందని తెలిపారు. సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

  • Published on- April 18, 2026 / 06:54 PM IST
  • ఈ నెల 20వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ప్రారంభం
  • రెవెన్యూలో కొత్త పాలసీ తెచ్చేందుకు కసరత్తు
  • అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి

Ponguleti Srinivasa Reddy: త్వరలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వ్యాల్యూ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందన్నారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నామని, అందుకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.

క్యాబినెట్ విస్తరణపై చర్చ ఉందన్నారు మంత్రి పొంగులేటి. విడతల వారీగా జరగడం కొత్తేమీ కాదన్నారు. శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజం అన్న ఆయన.. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని తేల్చి చెప్పారు. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనా మంత్రి పొంగులేటి స్పందించారు. సమ్మర్ అయ్యాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్ని మంత్రి చెప్పారు. నాలుగు రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు.

అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్ లో నేను పడను, అందుకే ఎంత విమర్శించినా ఓపిగ్గా ఉండి సమాధానం చెప్పానని మంత్రి పొంగులేటి వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారవుతోందని తెలిపారు. సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Also Read: తెలంగాణలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. మే నెలలోనే పోలింగ్..!