Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మె.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. మేము సిద్ధం
ఇది ప్రజా పాలన ప్రభుత్వం. ఆర్టీసీ సిబ్బంది ఎప్పుడైనా తమ సమస్యలపై మాట్లాడొచ్చు. ఆ రెండు అంశాలు తప్ప అన్ని సమస్యలను పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
- Naveen
- Published On : April 13, 2026 / 05:29 PM IST
Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మెపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు సమస్యలు (యూనియన్లు, ఆర్టీసీ విలీనం) మినహా మిగతా అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు పొన్నం. సమ్మెకు వెళ్లొద్దని కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం అంశం కమిటీ పరిశీలనలో ఉందన్న పొన్నం.. పెండింగ్ డీఏ విడుదల చేశామని గుర్తు చేశారు. పీఆర్ సీపైన పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు.
”ఇది ప్రజా పాలన ప్రభుత్వం. ఆర్టీసీ సిబ్బంది ఎప్పుడైనా తమ సమస్యలపై మాట్లాడొచ్చు. రెండు అంశాలు.. ఒకటి యూనియన్లు, రెండు ఆర్టీసీ విలీనం.. దీనిపై కమిటీ వేశారు. కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వింటాం, పరిష్కరిస్తారు. మొన్న డీఏ ఇచ్చాం. పీఆర్సీ గురించి ఆలోచన చేస్తున్నాం. పాట పీఆర్సీలు ఇచ్చాము. కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటి సారి త్రీమెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్లలో దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం. బస్సులు పెంచుతున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం.
ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుగా ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావొద్దని కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సిబ్బంది సమస్యలు వినేందుకు, పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం, నేను, మేనేజింగ్ సంస్థ, ముఖ్యమంత్రి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఆ రెండు అంశాలు తప్ప అన్ని సమస్యలను పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
తమ డిమాండ్లపై గళమెత్తాలని కార్మికులు డిసైడ్ అయ్యారు. వేతనాలు, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మె తప్పదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.
Also Read: చర్లపల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయారెడ్డి బలవన్మరణం కేసులో ట్విస్ట్.. ప్రాణహాని ఉందంటున్న భర్త
