Vijaya Reddy Case: చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి బలవన్మరణం కేసులో ట్విస్ట్.. ప్రాణహాని ఉందంటున్న భర్త
ఈ ముగ్గురు ప్రేరేపించి, ఉసిగొలిపి విజయారెడ్డి చావడానికి కారణం అయ్యారు అని ఒక అనుమానం ఉంది. ఆ ముగ్గురి వల్ల నాకు ప్రాణహాని ఉంది.
Vijaya Reddy Case: చర్లపల్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయారెడ్డి బలవన్మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. ఇటీవల తన ఇద్దరు పిల్లలలో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ లో బలవన్మరణం చేసుకున్నారు విజయారెడ్డి. తన భార్య విజయారెడ్డి చావుకు ఆమె కుటుంబసభ్యులే కారణం అని సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విజయారెడ్డి అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలత కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తనను బెదిరిస్తున్నారంటూ కూడా పోలీసులకు తెలిపారు.
”నాకు ప్రాణహాని ఉంది. నా భార్య చనిపోవడానికి ఆ ముగ్గురే కారణం. దీనిపై నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, ఆయన భార్య లక్ష్మి.. ఈ ముగ్గురు ప్రేరేపించి, ఉసిగొలిపి విజయారెడ్డి చావడానికి కారణం అయ్యారు అని ఒక అనుమానం ఉంది. ఆ ముగ్గురి వల్ల నాకు ప్రాణహాని ఉంది. చంపేస్తామని నన్ను బెదిరించారు. ప్రొటెక్షన్ ఇస్తామని పోలీసులు చెప్పారు. నా భార్య, పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తి కోసం వేధిస్తున్నారు” అని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆరోపించారు.
