Minister Seethakka : అంగన్వాడీలకు అలర్ట్.. జీతం పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన
Minister Seethakka : తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు కీలక అలర్ట్. వారి జీతాల పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : April 10, 2026 / 02:50 PM IST
minister seethakka distributes smart phones to anganwadi teachers at kothagudem idoc office
- కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
- అంగన్వాడీల వేతనాలపై సీతక్క కీలక వ్యాఖ్యలు
- అంగన్వాడీల జీతాల విషయంలో కేంద్ర సహకారం లేదు
Minister Seethakka : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ విషయంలో కావాలనే కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. మాలాంటి వాళ్లను అంటే నాశనం అవుతారు.. బాగుపడరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు.
తాజాగా మంత్రి సీతక్క.. కొత్తగూడెం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 1,954 మంది అంగన్‌వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు, బేటీ బచావో – బేటీ పఢావో కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
అనంతరం సీతక్క మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే ఫోన్లను కొనుగోలు చేయడం జరిగింది. కావాలనే కొందరు పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ధర మేరకు ఓపెన్ టెండర్లు, ఆన్లైన్ టెండర్ల ద్వారా ఆహ్వానించి ఫోన్లను అతితక్కువ ధరకు కొనుగోలు చేశాం. పిచ్చి పిచ్చిగా వాగుతూ నోటికి వచ్చిన విధంగా ఆధారాలు లేకుండా మాట్లాడేవారిపై కోర్టు ద్వారా లీగల్ గా చర్యలు తీసుకుంటాం. మాలాంటి వాళ్ళను అంటే నాశనం అవుతారు, బాగుపడరు” అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు.
“11,650 రూపాయలకే సెల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. కావాలని 14 వేలకు కొన్నాం అని విష ప్రచారం చేస్తున్నారు. ఇలాగే అన్యాయంగా మా మీద ఆరోపణలు చేసిన వారు మూడు నెలలకే కింద పడి శిక్ష అనుభవించారు. మేము కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. అంగన్‌వాడీల కొరకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తుంటే.. కావాలనే ఒక సంఘం రోడ్డు మీదకు వస్తుంది, అది చూసి మరొకటి వస్తుంది. ఇలాంటి సంఘాలను అంగన్‌వాడీలు నమ్మాల్సిన పనిలేదు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు రావచ్చు. అంగన్‌వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నేను, మా ప్రభుత్వం తీసుకుంటుంది” అని హామీ ఇచ్చారు.
అలాగే, “కేంద్ర ప్రభుత్వం నుండి అంగన్‌వాడీల జీతాల విషయంలో సహకారం అందడం లేదు. ఈ సమస్యపై పలుమార్లు కేంద్ర మంత్రిని సైతం కలిశాము. అంగన్‌వాడీ టీచర్లకు ఎప్పటికీ ఒకేలా ఉండేలా యూనిఫామ్‌లను అందజేస్తాం. హైదరాబాద్ లాంటి నగరాల్లో ముందు ముందు మొబైల్ అంగన్‌వాడీలను సైతం ఏర్పాటు చేయనున్నాం” అని సీతక్క తెలిపారు.
