MLC Vijayashanthi: మేము పోరాటం చేయకుంటే మీరు సీఎం అయ్యేవారా? మండలిలో రాములమ్మ ఉగ్రరూపం

ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు విజయశాంతి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే చారిత్రక తప్పిదం అవుతుందన్నారామె.

  • Published On : March 30, 2026 / 07:06 PM IST

 

MLC Vijayashanthi: తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంటి స్థలం, ఉద్యోగం, పెన్షన్ ఇస్తామని చెప్పిందన్నారు. రెండేళ్లు గడిచినా హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఉద్యమకారులు ఉద్యమం చేయకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా? సీఎం, మంత్రులు ఉండే వాళ్లా? అని ప్రశ్నించారు విజయశాంతి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు విజయశాంతి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే చారిత్రక తప్పిదం అవుతుందన్నారామె.

”తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులను గుర్తు పెట్టుకోవాలి. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఉద్యమం చేసినందుకే కదా తెలంగాణ వచ్చింది. మేమందరం పోరాటం చేయబట్టే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం రాకపోతే మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు ఉండే వాళ్లా? ఇవాళ ప్రతి ఒక్కరు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టే. సమైక్యవాద నాయకులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు ముందు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు. పోరాడాం, త్యాగాలు చేశాం, సర్వస్వం పొగొట్టుకున్నాం. చచ్చి బతికాము.

ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి. ఉద్యమకారులను మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ఎందుకు ఆలస్యం అవుతోంది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు చేసి ఉంటే గౌరవంగా ఉండేది. తమకిచ్చిన హామీల అమలు కోసం ఉద్యమకారులు ఇంకా పోరాటం చేస్తున్నారు, అడుగుతున్నారు. అలా అడిగిన ఉద్యమకారులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. తెలంగాణ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పిలిచి మాట్లాడాల్సింది.

హామీల అమలు ఆలస్యం అవుతుందనో లేదా హామీలు నెరవేరుస్తాం అని వారితో మాట్లాడి ఉంటే వాళ్లకి ఒక సంతృప్తి ఉండేది. కమిటీ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు అయిపోయాయి. ఒక ఉద్యమకారిణిగా నేను అడుగుతున్నా, ఎన్నిసార్లు అయినా గుర్తు చేస్తాను. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేరిస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది” అని విజయశాంతి హెచ్చరించారు.

Also Read: శకుని లేకపోతే కృష్ణుడు లేడు! కేసీఆర్‌ లేకపోతే నేను లేను..! సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు