Cm Revanth Reddy: శకుని లేకపోతే కృష్ణుడు లేడు! కేసీఆర్ లేకపోతే నేను లేను..! సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ను కేటీఆర్, హరీశ్ రావు గృహ నిర్బంధం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
Cm Revanth Reddy: చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. కేసీఆర్ లేకపోతే నేను లేను.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది అని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాలనాగు కంటే ప్రమాదం అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను కేటీఆర్, హరీశ్ రావు గృహ నిర్బంధం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు. కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చింది. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చింది.
దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప..
”రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. 40 ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోంది. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారు. దొడ్డు బియ్యం తినే వారు లేక ఆ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది. దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించాం.
అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించాం.
ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్న వడ్లు పండించాలని ప్రోత్సహించాం. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్ లో ఇది 90 శాతం కూడా కావచ్చు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు అందించాం. రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నాం. సన్న బియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గింది. పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయింది. మా నెక్ట్స్ టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడం.
అందుకే వరి ఒక్కటే కాదు ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి చేయం. అవగాహన కల్పిస్తాం. ఈగల్, హైడ్రా లాగే ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక వ్యవస్థను తీసుకొస్తాం. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: రేవంత్ రెడ్డిని దింపే వాళ్లతో కలుస్తా- 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
