MP Arvind visits karimnagar over jawahar navodaya school
కరీంనగర్ జిల్లా, కోరుట్ల పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవోదయ విద్యాలయానికి 10 ఎకరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈ పాఠశాల 2025, అక్టోబర్ 1నే మంజూరైందని, కానీ ఎమ్మెల్యేకు ఆసక్తి లేకపోవడంతో పనులు మొదలుకాలేదన్నారు. ఈ పాఠశాలను తన వ్యవసాయ భూమి దగ్గర పెట్టాలన్నది ఎమ్మెల్యే కోరిక అని, అది నేరుగా చెప్పలేక.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవడం లేదని సాకులు చెబుతున్నారని విమర్శించారు. “నీ కోసం నేను అతన్ని తిట్టాలా?” అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.
“వీళ్లకు రాజకీయం వ్యాపారంగా మారింది. చిల్లర కథలు చేస్తున్నారు. ఇష్యూ చేద్దామని ఓ బ్యాచ్‌ని పంపారు. నా డ్రైవర్ కూడా అలాంటి వాటికి భయపడడు. నీకు ఓ పిలగాడు నచ్చితే నీ పార్టీలో జాయిన్ చేసుకో. కోవర్ట్ రాజకీయాలు ఇక్కడ నడవవు. కోవర్టుల వల్లనే తెలంగాణలో ప్రభుత్వం రావడం లేదు. శ్రావణి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చింది, ఆ మహిళను చూసి నేర్చుకో. మేము పుట్టిందే గ్రూప్ పాలిటిక్స్‌లో, పుట్టినప్పటి నుంచి వీటిని చూస్తున్నాను. దమ్ముంటే నేను ఉన్నప్పుడు వచ్చి రాళ్లు వేయ్” అని సవాల్ విసిరారు.
“సస్పెండ్ అయిన వాళ్ల గురించి 6 ఏళ్ల తర్వాత ఆలోచన చేస్తాం. నాకు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంది. ఇకపై జగిత్యాలకు తరచుగా వస్తాను. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం వస్తే.. ఈ ఏరియాకు మరింత డిమాండ్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి. అందుకే ఆ ఎమ్మెల్యే తన భూమి వద్దే ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. అతడికి భవిష్యత్తులో బీజేపీలో చేరే ఆలోచన కూడా ఉంది. చేరితే సంతోషం, చేరకపోయినా ఇంకా సంతోషం. అంతే కానీ ఇలా నల్లికుట్ల వ్యవహారం చేయకండి” అని వ్యాఖ్యానించారు.