×
Ad

మున్సిపోల్స్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు.. ఏమేం జరిగాయంటే?

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వేళ పార్టీల పొత్తులు, నేతల ఎక్స్ అఫీషియో ఓట్లు సరికొత్త పాలిటిక్స్‌కు తెరలేపినట్లు అయింది.

  • మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో గమ్మత్తుగా పార్టీల తీరు.. 
  • నేతలకు నచ్చిన వారికి ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన పరిస్థితి
  • ఓ చోట బీఆర్ఎస్.. మరో చోట కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు

Telangana municipal elections: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా..తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సీన్లు కనిపించాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వరకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా బిహేవ్ చేసిన రాజకీయ పార్టీలు, నేతలు..ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నాటికి దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసిపోయారు.

హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకునేందుకు..పరిస్థితులను బట్టి ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. కాంగ్రెస్-బీజేపీ, కాంగ్రెస్-బీఆర్ఎస్, బీజేపీ-బీఆర్ఎస్..ఇక ఓ చోట కాంగ్రెస్‌తో, మరో చోట బీఆర్ఎస్‌తో సీపీఐ పొత్తు..ఇలా ఓ రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆసక్తికర చర్చకు దారితీశారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ హామీలు, గ్యారెంటీలతో పాటు సీఎం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని లోపాలను ఎత్తిచూపుతుంది.

Also Read: MP Chamala Kiran Kumar: కాంగ్రెస్‌లో కోవర్టులు..! వారి వల్లే కొన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయాం- ఎంపీ చామల

కానీ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో లోకల్ ఈక్వేషన్లో భాగంగా ఎథిక్స్..పార్టీ లైన్స్ ఇవేవి పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తులతో 5 మున్సిపాలిటీ పీఠాలను కైవసం చేసుకున్నారు. కామారెడ్డి, దేవరకద్ర, వేములవాడ, ఇస్నాపూర్, అమరచింత మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుని బీజేపీకి చెక్ పెట్టాయి కాంగ్రెస్, బీఆర్ఎస్.

కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఇందులో బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఫార్వర్డు బ్లాక్ 2, స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజర్ అయింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి సహకరించేందుకే ఎన్నికకు హాజరుకాలేదని విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నిక జరిగిందని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో స్వతంత్రులు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ చేరింది. దీంతో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జిన్నారం, అమన్గల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్-బీజేపీ కలిసి దక్కించుకున్నాయి. ఇక్కడ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేల ఎక్స్ అఫీషియో ఓట్లు ఫలితాన్ని డిసైడ్ చేశాయి.

ఇంకా ఎక్కడెక్కడ?
నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ సేమ్ సీన్. అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోయినప్పటికీ, సమీకరణాల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఛైర్మన్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి వైస్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తు చర్చనీయాంశంగా మారింది.

అలియాబాద్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో 8 సీట్లున్న కాంగ్రెస్ కు 3 సీట్లున్న బీజేపీతో పాటు ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 13కి చేరి విజయం సాధించింది. జిల్లా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది.

ఇక జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు గెలవగా ఇక్కడ ఇంటిపెండెంట్లు, బీజేపీ మద్దతుతో ఛైర్మన్, వైస్ ఛైర్మెన్ పదవులను దక్కించుకుంది. ఇక కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కమలం పార్టీ. మైనార్టీ నేతకు ఓటు వేసి ఆసక్తికర చర్చకు దారితీశారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు.

ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీని బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 12 మంది కౌన్సిలర్లతో పాటు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్-అఫీషియో ఓట్ల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఏకంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్కు మద్దతు తెలపడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

బీఆర్ఎస్ ఛైర్మన్అభ్యర్థికి ఓటేసేందుకు గూడెం మహిపాల్ రెడ్డి, రఘునందన్‌రావు ఒకే కారులో రావడం సమ్థింగ్ హైలెట్గా నిలిచింది. ఇక ఎల్లంపేటలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న ఎంపీ ఈటల రాజేందర్..ఛైర్మన్ ఎన్నికు మాత్రం హాజరు కాలేదు. ఇక కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ సహకరించింది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై బీఆర్ఎస్కు మరోసారి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ.

నిన్న మొన్నటి వరకు రెండున్నరేళ్ల చొప్పున ఛైర్మన్ పదవి షేర్ చేసుకుందని కోరిన బీజేపీ..ఇప్పుడు ఛైర్మన్ తమకు ఇచ్చినా పర్వాలేదు, బీఆర్ఎస్ తీసుకున్న ఒకే అంటున్నారు కాషాయం నేతలు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ కాంగ్రెస్తో పొత్తులో ఉంటే..కొత్తగూడెంలో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏకంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కాల్ చేసి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని భేషరతుగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వేళ పార్టీల పొత్తులు, నేతల ఎక్స్ అఫీషియో ఓట్లు సరికొత్త పాలిటిక్స్‌కు తెరలేపినట్లు అయింది.