MP Chamala Kiran Kumar: కాంగ్రెస్లో కోవర్టులు..! వారి వల్లే కొన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయాం- ఎంపీ చామల
ఈ ఎన్నికల తర్వాత పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు పంపిన అబ్జర్వర్లతో రిపోర్టులు తెప్పించుకుని ఓటమికి గల కారణాలను మనం పరిశోధన చేసుకోవాలి.
MP Chamala Kiran Kumar Representative Image (Image Credit To Original Source)
- గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోవాల్సి వచ్చింది
- అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయి
- పార్టీ ప్రక్షాళన జరగాల్సిందే
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీపైనే హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని, కోవర్టుల వల్లే కొన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయామని ఆయన అన్నారు. గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోవాల్సి వచ్చిందని వాపోయారు. ఓటములపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించాలని ఎంపీ చామల కోరారు. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయన్న ఆయన.. ఢిల్లీ టూర్ తర్వాత పార్టీ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు.
”నా పార్లమెంట్ పరిధిలోనే రెండు సీట్లు కోల్పోవడం జరిగింది. ఈ సీట్లు కోల్పోవడానికి కారణం ఏంటో ఆలోచించాలి. మా ముఖ్యమంత్రి పాలన, మా ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజలు ఏ విధంగా అయితే ఆదరిస్తారో.. అలానే ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి దారిలోనే నడవాలి. ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉండాలి. ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కడెక్కడ పట్టించుకోవడం లేదో, ఎక్కడెక్కడ విస్మరిస్తున్నారో.. కార్యకర్తలకు, నాయకులకు మధ్య గ్యాప్ వచ్చిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు వారిని ఆపరేట్ చేసి వారి కోపాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నంలోనే రెండు సీట్లు ఓడిపోయాం. ఆ రెండు సీట్లు కూడా ఓడిపోయే పరిస్థితే లేకుండే.
ఈ ఎన్నికల తర్వాత పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు పంపిన అబ్జర్వర్లతో రిపోర్టులు తెప్పించుకుని ఓటమికి గల కారణాలను మనం పరిశోధన చేసుకోవాలి. ఏం జరిగిందో అంతర్మధనం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ని నమ్మినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటో పార్టీ పెద్దలు తెలుసుకోవాలి. మనల్ని భుజాలపై మోసి గెలిపించిన కార్యకర్తలను పట్టించుకోనప్పుడు ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద కచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి” అని ఎంపీ చామల అన్నారు.
Also Read: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
