Parties Representative Image (Image Credit To Original Source)
Municipal Elections: క్యాంప్ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గెలిచిన అభ్యర్థులు చేజారకుండా ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపాయి. చైర్మన్, మేయర్ల ఎంపికపై పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులు చేజారి పోకుండా క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామన్న ధీమాలో బీజేపీ ఉంది. మరో రెండు కార్పొరేషన్లలో కీ రోల్ లో ఉంటామని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. 10 నుంచి 15 మున్సిపాలిటీలు గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. 100కు పైగా మున్సిపాలిటీల్లో ఖాతా తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హంగ్ వస్తే కింగ్ మేకర్స్ అవుతామని అంచనాలు పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థులను క్యాంప్ కి తరలిస్తోంది హైకమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ కు బస్సులో తరలిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి కూడా అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుంది బీజేపీ. ఇప్పుడు క్యాంప్ రాజకీయాల్లోనూ ఒక అడుగు ముందే ఉంది. అనేక స్థానాల్లో కింగ్ మేకర్ కానున్నామనే అంచనాలతో తమ అభ్యర్థులను క్యాంప్ నకు తరలిస్తోంది బీజేపీ. మొత్తం ఏడు కార్పొరేషన్లలో కనీసం రెండింటిని పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంటామనే ధీమాలో బీజేపీ నాయకులు ఉన్నారు. నిజామాబాద్, కరీంనగర్ ను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. అదే విధంగా మహబూబ్ నగర్, మంచిర్యాలలో మెరుగైన స్థానాలు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామనే ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులను క్యాంప్ లకు తరలించారు.
అటు బీఆర్ఎస్ సైతం క్యాంప్ పాలిటిక్స్ షురూ చేసింది. తమ పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల ఆకర్షణకు చిక్కకుండా ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే సూర్యాపేట లాంటి మున్సిపాలిటీలో అభ్యర్థులను క్యాంప్ నకు తరలించారు. మరోవైపు పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పోటాపోటీగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇలా పోటాపోటీగా ఉన్న మున్సిపాలిటీల్లో అభ్యర్థుల గెలుపుతో సంబంధం లేకుండా పోటీ చేసిన అందరు అభ్యర్థులను క్యాంప్ నకు తరలించాలని ప్లాన్ చేసింది గులాబీ పార్టీ.
సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ క్యాంప్ నకు తరలించారు. నిన్న రాత్రి 44 మందిని, ఇవాళ మరో నలుగురిని క్యాంప్ నకు తరలించారు. మొత్తం 48 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఉండటం చర్చకు దారితీసింది. హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ లో క్యాంప్ ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత పదేళ్లుగా సూర్యాపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. సూర్యాపేట మున్సిపాలిటీలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అభ్యర్థులు చేజారకుండా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించారని సమాచారం.
Also Read: తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్టులు.. అసలు కాంగ్రెస్, సీపీఐకి ఎక్కడ చెడింది..?