CPI: అసలు కాంగ్రెస్, సీపీఐకి ఎక్కడ చెడింది..?
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని..రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
- పురుపోరులో కాంగ్రెస్, సీపీఐ.. చెరో దారి
- కొత్తగూడెంలో టీడీపీతో కలిసి పోటీ
- మంచిర్యాలలో బీఆర్ఎస్కు సపోర్ట్
- చాలా చోట్ల వేర్వేరుగా కాంగ్రెస్, సీపీఐ పోటీ
తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు, తెలంగాణ జన సమితి మద్దతులతో..కాంగ్రెస్ లబ్ది పొందగలిగింది. అధికారంలోకి రావడంతో ఆ రెండు పార్టీల బంధాన్ని అలాగే కంటిన్యూ చేయాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. ముందస్తుగా ఆ పార్టీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హామీలను అమలు చేయాలనుకుంది.
సీపీఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయించింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నామినేట్ చేసింది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా..పదవులు ఇచ్చి బంధాలను కంటిన్యూ చేసుకోవాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ బంధం నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉన్నా..మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తూట్లు పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఎవరికి వారే పోటీ చేశారు.
సీపీఐ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెం. కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే మాత్రమే కాదు.. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా. అలాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐకి పొత్తు కుదరలేదు. దీంతో రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు బీటలు వారిందనే టాక్విన్పిస్తోంది.
Also Read: బ్యాక్ టు వైసీపీ.. దువ్వాడకు గ్రీన్‌సిగ్నల్ వచ్చేసినట్లేనా?
మున్సిపల్ ఎన్నికల సైరన్ మోగిన మొదట్లో.. రెండు పార్టీలు కలిసే పని చేయాలని భావించాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీపీఐతో కలిసే పనిచేస్తాయంటూ పలుసార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ కొత్తగూడెం పొత్తు విషయంలో రెండు పార్టీలు పంతం పట్టాయి.
కొత్తగూడెంలో తమ ఎమ్మెల్యే ఉండటంతో మున్సిపల్ టికెట్లలో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ససేమిరా అంటూ మొండికేసింది. మెజారిటీ సీట్లు తమకే కావాలని కాంగ్రెస్ పట్టుపట్టింది. దీంతో ఆఖరి వరకు వేచి చూసిన సీపీఐ..ఒంటరి పోరుకు మొగ్గు చూపింది. దీంతో కొత్తగూడెం ఎఫెక్ట్..రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలపై కూడా పడింది. చాలా మున్సిపాలిటీల్లో సీపీఐ, కాంగ్రెస్ ఎవరికి వారే పోటీ చేశారు. కొన్ని చోట్ల సీపీఐ నేతలు బీఆర్ఎస్ తోనూ జట్టు కట్టారు.
ఓ కీలక మంత్రే కారణమని రెండు పార్టీల్లో చర్చ
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని..రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ పొత్తు కుదరడంతో..కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చి..తాను పాలేరుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కొత్తగూడెం నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో పొంగులేటి ఉన్నారట.
అందుకే కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐని కాదని..ఒంటరి పోరాటానికి మొగ్గు చూపేలా స్కెచ్ వేశారట. ఇప్పుడు సీపీఐ రాష్ట్ర నాయకత్వం మంత్రి పొంగులేటి తీరుపై గుర్రుగా ఉందట. పొంగులేటి తీరు వల్లే రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయని రగిలిపోతున్నారట. కాంగ్రెస్, సీపీఐ మధ్య భవిష్యల్తో అయినా పొత్తు ఉంటుందా.? ఇప్పుడు వచ్చిన గ్యాప్ కంటిన్యూ అవుతుందా అనేది ఎన్నికల ఫలితాలను బట్టే తేలే అవకాశం ఉంది.
