NIT Warangal: రూ.1.27 కోట్లు ప్యాకేజ్.. ఎన్‌ఐటీ వరంగల్ రికార్డ్ ప్లేస్‌మెంట్స్… 130 మందికి ముప్పై లక్షల ప్యాకేజీతో జాబ్స్
షనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Warangal), వరంగల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది.
- V Santhosh Kumar
- Published on- June 25, 2026 / 11:35 AM IST
NIT Warangal student created record by securing a campus placement with 1.27 crore salary package
- ఎన్‌ఐటీ వరంగల్ రికార్డు ప్లేస్‌మెంట్లు.
- గరిష్ట ప్యాకేజీ రూ.1.27 కోట్లు.
- విద్యార్థుల అద్భుత కెరీర్ విజయం.
NIT Warangal: ప్రస్తుత పోటీ ప్రపంచంలో, సవాళ్లతో కూడిన గ్లోబల్ ఉద్యోగ మార్కెట్ పరిస్థితుల్లోనూ దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Warangal), వరంగల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విభాగాల్లోని విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించి విద్యాసంస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేశారు.
కళ్ళు చెదిరే ప్యాకేజీలు.. కోటి దాటిన వేతనం:
ఈ ఏడాది ఎన్‌ఐటీ వరంగల్ చరిత్రలోనే నిలిచిపోయే మైలురాయి నమోదైంది. దేశీయంగా ఒక విద్యార్థి ఏకంగా రూ.1.27 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని అందుకోగా, రూ.70 లక్షలకు పైగా వేతనంతో కూడిన అనేక ఆఫర్లు లభించాయి.
* రూ.70 లక్షల పైగా ప్యాకేజీ: 6 మంది విద్యార్థులు
* రూ.50 లక్షల పైగా ప్యాకేజీ: 27 మంది విద్యార్థులు
* రూ.30 లక్షల పైగా ప్యాకేజీ: 130 మందికి పైగా విద్యార్థులు
* రూ.10 లక్షల పైగా ప్యాకేజీ: 720 మందికి పైగా విద్యార్థులు
అలాగే యూజీ విద్యార్థుల సగటు వార్షిక వేతనం రూ.18.54 లక్షలుగా నమోదు కాగా, పీజీ విద్యార్థులకు సగటున రూ.12.13 లక్షల వేతనం లభించింది.
విజయవంతమైన ప్లేస్‌మెంట్ రేటు:
ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో అర్హులైన 704 మంది యూజీ విద్యార్థులలో 660 మందికి పైగా (93.75 శాతం) ఉద్యోగాలు సాధించారు. ఇక పీజీ విభాగంలో 860 మంది విద్యార్థులకు గాను 677 మంది (78.72 శాతం) మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం కొందరు ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నందున, రాబోయే రోజుల్లో యూజీ ప్లేస్‌మెంట్ రేటు 95 శాతానికి, పీజీ రేటు 80 శాతానికి దాటే అవకాశం ఉంది. కోర్ ఇంజినీరింగ్ రంగంలో అత్యధికంగా 480 ఆఫర్లు రాగా, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో 410, అనలిటిక్స్‌లో 230 ఆఫర్లు వచ్చాయి.
పరిశ్రమల నమ్మకం.. సమిష్టి కృషి:
గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఎన్‌ఐటీ పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో కేవలం 305 కంపెనీలు రాగా, ఈసారి రికార్డు స్థాయిలో 360కి పైగా ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి కంపెనీలు చూపిన విశ్వాసానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయంపై సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బిధ్యాధర్ సుబుధి హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించిన ‘సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్’ (CCPD) హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్ బృందాన్ని, అధ్యాపకులను, ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
