Nizamabad incident
Nizamabad : కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. సర్పంచ్ పదవిపై వ్యామోహంతో సొంత బిడ్డను హత్యచేశాడు. సాగునీటి కాల్వలలో ఓ బాలిక మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Silver Price : భారీగా తగ్గిన వెండి ధర.. ప్రధాన కారణాలివే.. మళ్లీ కిలో వెండి రూ.లక్షకు చేరుతుందా..?
కేసు దర్యాప్తులో భాగంగా.. బాలిక చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పోస్టు చేశారు. మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామంలో ఉంటున్న అతని బంధువులు చూసి గుర్తుపట్టారు. పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టగా దిగ్బ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలో మరో ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలని భావించగా.. అందుకు ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారింది. దీంతో తన ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డను హతమార్చితే తాను సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేయొచ్చునని నిందితుడు భావించి కర్కశంగా వ్యవహరించారు.
మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరుర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాండురంగ ముఖేడ్ లో విరాట్ సెలూర్ పేరిట షాపుపెట్టి క్షౌర వృత్తి చేస్తున్నాడు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులకు తెలియజేశాడు. అయితే, ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని వారు చెప్పడంతో.. తన ముగ్గురు పిల్లల్లోని ఒక బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అదేగ్రామానికి చెందిన సర్పంచ్ గణేశ్ షిండే సలహాతో.. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయిందని అందరికీ చెప్పాలని, తద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావించారు.
ముగ్గురు పిల్లల్లో తన పెద్దకుమార్తె ప్రాచికి నిజామాబాద్ వెళ్దామని పాండురంగ మాయమాటలు చెప్పాడు. మోటార్ బైక్ పై తీసుకొచ్చి మార్గంమధ్యలో ఎడపల్లి మండలం నిజాంసాగర్ కెనాల్ నీటిలో తోసేశాడు. జనవరి 29న ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలో గల నిజాంసాగర్ డీ-42/8 కెనాల్లో గుర్తు తెలియని ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పాండురంగతోపాటు అతనికి సహకరించిన గణేశ్ లను పోలీసులు అరెస్టు చేశారు.