Hyderabad Crime: ఆరు హత్యలు.. ఏడు ఇటుకలు.. షాబాద్ మర్డర్ మిస్టరీ

Hyderabad Crime: షాబాద్‌ (Shahbad Tragedy) మండలంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో తన సొంత కుటుంబంతో సహా మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.

POCSO case accused Raj Kumar brutally murdered six people in Shahbad Ranga Reddy

  • ఆరుగురిని చంపిన ఉన్మాది
  • పోక్సో కేసు కక్షతో ఘాతుకం
  • ఏడు ఇటుకల క్షుద్రపూజల మిస్టరీ

Hyderabad Crime: రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత ఘోరమైన సామూహిక హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. షాబాద్‌ మండలం దైవాలగూడ గ్రామంలో పగ, కక్షతో ఊగిపోయిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో తన సొంత కుటుంబంతో సహా మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. గతంలో తనపై నమోదైన పోక్సో (POCSO) కేసు విషయంలో పెంచుకున్న కక్షే ఈ ఘాతుకానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్థరాత్రి వేళ ఒక్కసారిగా జరిగిన ఈ మారణహోమం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.

Also Read: రైతులను ముంచేశారు.. దేవుడిపై ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు.. సీఎం రేవంత్‌పై పువ్వాడ అజయ్ ఫైర్

అర్ధరాత్రి రెండు కుటుంబాల అంతం:

నిందితుడు రాజ్‌కుమార్ (Shahbad Tragedy) ముందుగా తనపై కేసు పెట్టిన 17 ఏళ్ల బాలిక ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి చొరబడి, గాఢనిద్రలో ఉన్న బాలిక తల్లిని, నానమ్మను కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సదరు బాలికను బలవంతంగా సమీపంలోని నాగర్‌కుంట చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ హతమార్చాడు. అంతటితో నిందితుడి ఉన్మాదం చల్లారలేదు; వెంటనే తన స్వగృహానికి చేరుకుని, అక్కడ నిద్రిస్తున్న తన భార్య సరిత (30), మూడేళ్ల కొడుకు, రెండేళ్ల కుమార్తెను కూడా దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘోరాల అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తాను ఆరుగురిని చంపేశానని, తానూ చనిపోతున్నానని చెప్పి పరారయ్యాడు. గతంలో ఆ అమ్మాయి వాళ్ల నాన్నను కూడా రాజ్ కుమార్ చంపాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దానికి గల కారణాలు, వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ‘ఏడు ఇటుకల’ మిస్టరీ ఏంటి?

ఈ దారుణ ఉదంతంలో పోలీసుల దర్యాప్తులో ఒక దిగ్భ్రాంతికరమైన, మిస్టరీ అంశం వెలుగుచూసింది. హత్యలు జరిగిన నాగర్‌కుంట చెరువు వద్ద నిందితుడు ఏడు ఇటుకలను ఒకదానిపై ఒకటి క్రమపద్ధతిలో పేర్చి ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ చర్య వెనుక మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు లేదా నిందితుడి వికృత ఆలోచనలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సామూహిక హత్యల వెనుక అసలు రహస్యాన్ని ఛేదించడానికి, పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.