Mallana Sagar Reservoir Issue : మల్లన్నసాగర్ దగ్గర బండరాయి బ్లాస్టింగ్‌పై రాజకీయ రచ్చ..

Mallana Sagar Reservoir Issue : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కాస్త ప్రతిపక్షానికి అస్త్రంగా మారిందన్న చర్చ జరుగుతోంది.

Mallana Sagar Reservoir Issue

Mallana Sagar Reservoir Issue : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కాస్త ప్రతిపక్షానికి అస్త్రంగా మారిందన్న చర్చ జరుగుతోంది. లేటెస్ట్‌గా హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు, ఇరిగేషన్ శాఖల మధ్య తలెత్తిన సమన్వయలోపం పెద్ద వివాదంగా మారుతోంది. చినికి చినికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు.. HMWS పనులు చేపట్టింది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు చేపట్టిన తవ్వకాలు ప్రధాన సమస్యగా మారాయి.

Also Read : Work From Home : నవంబర్ 5 నుంచి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..! కారణం ఇదే..

ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా పనులు చేపట్టారు వాటర్ బోర్డు అధికారులు. మల్లన్నసాగర్ దగ్గర తవ్వకాల్లో భాగంగా బండరాయి రావడంతో జిలెటిన్‌స్టిక్స్‌తో పేల్చారు. ఎక్కడైనా ప్రాజెక్టుల దగ్గర ఎలాంటి పనులు చేపట్టాలన్నా..ఇరిగేషన్ శాఖ నిపుణుల సమక్షంలోనే చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకుంటుంది ఇరిగేషన్ శాఖ. అయితే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు మెట్రోవాటర్ బోర్డు అత్యుత్సాహం ప్రదర్శించి.. బండరాళ్లను తొలగించేందుకు బాంబు పేలుళ్లకు పాల్పడటంతో ఇరిగేషన్ శాఖ కన్నెర్ర చేసింది.

ఇరిగేషన్ శాఖకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తూ..పేలుళ్లకు పాల్పడటంతో మెట్రోవాటర్ బోర్డు తీరుపై సీరియస్ అయ్యింది. రిజర్వాయర్‌కు అత్యంత దగ్గరలో పేలుళ్లకు ఎలా పాల్పడుతారంటూ..మెట్రో వాటర్ బోర్డుకు ఘాటు లేఖ రాసింది. సమగ్ర సాంకేతిక పరిశీలన పూర్తయ్యే వరకు బ్లాస్టింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించింది. బ్లాస్టింగ్ డిజైన్, బ్లాస్టింగ్ షెడ్యూల్, డ్రిల్లింగ్ సరళి, పేలుడు పదార్థాల వివరాలు తీసుకున్న భద్రతా చర్యలపై రిపోర్ట్ అందజేయాలని కోరింది. అలాగే బ్లాస్టింగ్ ప్రారంభించడానికి ముందు నిర్వహించిన జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక, వైబ్రేషన్ ప్రిడిక్షన్ అనాలిసిస్, రిస్క్ అసెస్మెంట్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఎవాల్యుయేషన్‌ను..ఇప్పటి వరకు నిర్వహించిన పేలుళ్ల పూర్తి డేటాను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇలా ఇరిగేషన్ శాఖ..మెట్రోవాటర్ బోర్డు తీరును తూర్పారబడుతుండటంతో..ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది.

మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి..వాటర్ బోర్డు అధికారుల తీరును ఎక్స్‌పోజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందు నుంచి కుట్రలు చేస్తోందని..ప్రాజెక్టులో అతికీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను కూల్చే కుట్ర చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గుండెకాయ లాంటి మల్లన్నసాగర్ ద్వారా 16లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్తాయని..అలాంటి రిజర్వాయర్‌ దగ్గర బాంబు పేలుళ్లు జరపడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. గతంలో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజ్‌లో కూడా ఇలాగే పేలుళ్లు జరిగి ఉంటాయని డౌట్స్ వ్యక్తం చేశారు.

ఇలా ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. మెట్రోవాటర్ బోర్డు చేసిన నిర్వాకం ప్రభుత్వానికి ఇరకాటంలోకి నెట్టిందనే భావన వ్యక్తమవుతోందట. హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు అధికారుల అత్యుత్సాహం ఇప్పుడు ప్రభుత్వానికి మచ్చగా మారిందట. మల్లన్నసాగర్ దగ్గర బండరాళ్లను పగలగొట్టడానికి మెట్రో వాటర్ బోర్డు జరిపిన పేలుళ్ల అంశాన్ని ప్రభుత్వంలోని ఇరిగేషన్ శాఖనే తప్పుపడుతోంది. లేటెస్ట్‌ పేలుళ్లను ముడిపెడుతూ..మేడిగడ్డలో కూడా ఇదే జరిగిందంటూ ప్రతిపక్షం ప్రచారం చేస్తుండటంతో..అధికార పక్షం డిఫెన్స్ పడుతోందట. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కాస్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందన్న టాక్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్‌ ఎటు టర్న్‌ తీసుకుంటుందో చూడాలి మరి.