ACB Raids: ఆర్అండ్బీలో అవినీతి అనకొండ.. ఈఎన్సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు.. కిలోల కొద్దీ బంగారం, నగదు స్వాధీనం
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జరుపుల మోహన్ నాయక్ భారీ అవినీతి(ACB Raids) తిమింగలంగా తేలింది.
- V Santhosh Kumar
- Updated on- June 10, 2026 / 07:44 AM IST
r&b enc mohan nayak acb raids disproportionate assets case
- ఈఎన్సీ మోహన్ నాయక్ ఏసీబీ సోదాలు.
- రూ.200 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.
- కిలోల కొద్దీ బంగారం, నగదు స్వాధీనం.
ACB Raids: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుపుల మోహన్ నాయక్ భారీ అవినీతి తిమింగలంగా తేలింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ(ACB Raids) అధికారులు ఆయనపై ఉక్కుపాదం మోపారు. మియాపూర్, మాదాపూర్‌లోని ఆయన నివాసాలతో పాటు నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన మెరుపు దాడుల్లో ఊహించని స్థాయిలో అక్రమాస్తుల పుట్ట బద్దలైంది.
ఈ సోదాల్లో మోహన్ నాయక్ ఇంట్లో లభించిన సంపదను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఆయన ఇల్లు, బంధువుల నివాసాల నుండి 15 గోల్డ్ బిస్కెట్లతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఆరు కిలోల వెండి, రూ.55 లక్షల నగదును సీజ్ చేశారు. వీటితో పాటు బ్యాంకుల్లో రూ.1.44 కోట్ల బ్యాలెన్స్, రూ.1.26 కోట్ల విలువైన విలాసవంతమైన గృహోపకరణాలు లభించాయి. అంతేకాకుండా ఇంట్లోనే చిన్నపాటి మినీ బార్‌ను ఏర్పాటు చేసుకుని రూ.4.44 లక్షల విలువైన 22 విదేశీ మద్యం బాటిళ్లను దాచడం గమనార్హం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు రోడ్ల నిర్మాణాల టెండర్లు, కాంట్రాక్టుల్లో ఈయన భారీగా కమీషన్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడిన చర, స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.
