Rahul Gandhi in Telangana Election Campaign
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక వైపు, కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కారు నాలుగు టైర్లలో గాలి పోయిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు. 24 గంటలు మోదీ తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారని, కలలో కూడా మోదీ తనను వదలడం లేదని అన్నారు.
ఇప్పటి వరకు తన మీద 24 కేసులు పెట్టారని, సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు తనపై దాడి చేస్తున్నాయని రాహుల్ అన్నారు. తన ఇల్లు లాక్కున్నారని, అయితే తన ఇల్లు భారతదేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో ఉందని రాహుల్ అన్నారు. కేసులు పెట్టి లోకసభ నుండి వెళ్ళగొట్టారని, మోదీకి వ్యతిరేకంగా పోరాడితే కేసులు పెట్టారని, కానీ కేసీఆర్ పై ఎలాంటి కేసులు లేవని అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండూ బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: నకిలీ ఓటింగ్ రగడ.. కాల్పులు జరుపుకున్న బీజేపీ, బీఎస్పీ నేతలు
కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, ఎంఐఎంకు బీజేపీ డబ్బులిస్తుందని రాహుల్ అన్నారు. ఇక్కడ కేసీఆర్, దేశంలో మోదీ ఉండాలని ఎంఐఎం కోరుకుంటోందని.. కాంగ్రెస్ ముఖ్య కర్తవ్యం ఇక్కడ కేసీఆర్ ను అక్కడ మోదీని ఒడించడమేనని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అదాని నడిపిస్తే ఇక్కడ కుటుంబం నడిపిస్తోందని అన్నారు.
తెలంగాణ కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువకులు తెలంగాణలో పోరాడారని కొనియాడారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తిన్నారని, ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ మీ భూముల్ని లాక్కునే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓకే ఒక్క కుటుంబం దోచుకుంటుందని, కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచార రథంపై ప్రియాంక గాంధీ డ్యాన్స్ .. ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు