Revanth Reddy: పెర్ఫార్మ్ చేసినందుకు రాజీనామా చేయాలా?.. సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న
Revanth Reddy: విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు తాను రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
- Ashok Bonepalli
- Updated on- July 30, 2026 / 05:40 PM IST
Telangana CM Revanth Reddy Comments On Resignation As Education
Revanth Reddy: తెలంగాణలో విద్యాశాఖకు పూర్తిస్థాయిలో మంత్రి కావాలని, ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎందుకు తాను రాజీనామా చేయాలని నిలదీశారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ‘పెర్ఫార్మ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా? నర్సరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చినందుకు తప్పుకోవాలా? 30వేలకు పైగా టీచర్లకు ట్రాన్స్ ఫర్లు ఇచ్చినందుకు తప్పుకోవాలా?, ఐటీఐ నుంచి అప్ గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి119 నియోజకవర్గాలకు చేర్చినందుకు తప్పుకోవాలా?, విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకు తప్పుకోవాలా?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్ష సూచన.. పోలీస్ శాఖ కీలక సూచనలు..
గతంలో నాయకులు తీసుకొచ్చిన విద్యా సంస్కరణల వల్ల ప్రపంచంలో భారత్ నేడు ముందుకు వెళ్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, రేపటి ప్రపంచంతో పోటీ పడాలంటే అది సరిపోదున్నారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆ దిశగా విద్యార్థులను టీచర్లే తీర్చిదిద్దగలరని చెప్పారు. వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులకు సంబంధం లేదన్న రేవంత్ రెడ్డి విద్య లేకపోవడమే అసలైన వెనుకబాటుతనమని అభిప్రాయపడ్డారు.
ఇక ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు సగటున రూ.50వేలు ఖర్చు చేస్తోందన్నారు. కానీ, పేరెంట్స్ ప్రభుత్వ స్కూళ్ల విషయంలో ఎందుకు ముందుకు వెళ్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. ఈ మధ్య వారిలో కూడా మార్పు వస్తోందని.. ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది లక్ష మంది విద్యార్థులు అదనంగా జాయిన్ అయినట్టు చెప్పారు.
టీచర్లకు క్లాస్
ఈ సందర్భంగా టీచర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సుతిమెత్తగా క్లాస్ పీకారు. టీచర్ల సంఘాలు వాళ్ల సమస్యలే కాకుండా విద్యార్థుల సమస్యల మీద కొట్లాడాలని సూచించారు. అదే సమయంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం. ఒక ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్ ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి. దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేయండి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచన చేయండి. వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక రూపొందించండి. ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి టీచర్లుకు కీలక సూచనలు చేశారు.
