Paddy Prices: రైతన్నలకు కాసుల పంట.. ప్రభుత్వ మద్దతు ధరను దాటేసిన ధాన్యం రేట్లు.. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యానికి భారీ డిమాండ్
మెహబూబాబాద్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం, మక్కజొన్న ధరలు(Paddy Prices) రోజురోజుకూ పుంజుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 02:45 PM IST
RNR paddy price in Kesamudram market rise above the msp price
- ధాన్యం, మక్కల ధరల భారీ పెరుగుదల
- మద్దతు ధర కంటే అదనపు లాభాలు
- మార్కెట్లో మరింత పెరగనున్న ధాన్యం రేట్లు
Paddy Prices: రైతన్నల కష్టానికి ఫలితం దక్కింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం(Paddy Prices), మక్కజొన్న ధరలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. ఇక్కడి ‘ఈ-నామ్’ వేలంలో శుక్రవారం ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.2,689, సగటున రూ.2,636 ధర పలికింది. ఇది ప్రభుత్వ మద్దతు ధర (రూ.2,389) కంటే దాదాపు 300 రూపాయలు ఎక్కువ కావడం విశేషం. కేవలం పది రోజుల వ్యవధిలోనే ధాన్యం సగటు ధరల్లో క్వింటాకు రూ.297 మేర పెరుగుదల కనిపించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మక్కజొన్న విక్రయాలు – నిల్వలపై వ్యాపారుల ఆసక్తి:
మరోవైపు మక్కజొన్న ధరలు కూడా క్వింటాకు రూ.63ల వరకు పెరిగాయి. మార్కెట్లో శుక్రవారం మక్కలు గరిష్ఠంగా రూ.2,024, సగటున రూ.2,012 ధరలతో అమ్ముడయ్యాయి. మక్కజొన్న ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉన్నందున రైతులు ఎక్కువ శాతం ప్రభుత్వ కేంద్రాలకే విక్రయించారు. అయితే ఎకరాకు 26 క్వింటాళ్ల పరిమితి ముగిసిన వారు, ఆలస్యంగా పంట కోసిన వారు మిగిలిన సరుకును మార్కెట్‌కు తెస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయన్న అంచనాలతో వ్యాపారులు ముందస్తుగా ఈ స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారు.
ఎగుమతులు – మున్ముందు మరింత డిమాండ్:
కేసముద్రం మార్కెట్ నుండి బాయిల్డ్, ముడి ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా భారీగా ఎగుమతి అవుతోంది. రాబోయే రోజుల్లో సరుకు లభ్యత తగ్గుతుందనే అంచనాలతో వ్యాపారులు పోటీ పడుతుండటంతో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాకు రూ.2,700 మార్కును దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గరిష్ఠ లాభాలు సాధించడం కోసం మార్కెట్ రేట్లను నిశితంగా గమనిస్తూ రైతులు తమ పంటను విక్రయించేందుకు వేచి చూస్తున్నారు.
