Adilabad Airfield: ఆదిలాబాద్‌లో భారీ ఎయిర్పోర్ట్.. రూ.2,278 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
Telangana Airport: ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్లతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (Adilabad Airfield)’ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Adilabad airfield project telangana revanth reddy government
- రూ.2,278 కోట్లతో ఎయిర్‌ఫీల్డ్ మంజూరు
- వేలాది మందికి ఉపాధి అవకాశాలు
- 2026 నాటికి పనులు పూర్తి
Telangana Airport: ఉత్తర తెలంగాణ ప్రాంతీయ పురోగతిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా రూ.2,278.14 కోట్ల భారీ అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్’ (Adilabad Airfield) నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ ప్రాంత ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చే గేమ్ చేంజర్‌గా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగానికి ప్రధాన కేంద్రంగా మారనుంది.
పౌర, రక్షణ విమానయానం & ఆర్థిక ప్రయోజనాలు:
ఈ ప్రాజెక్ట్‌ను సాధారణ పౌర విమాన ప్రయాణాలు, భారత రక్షణ రంగానికి ఒకేసారి ఉపయోగపడేలా అత్యాధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఏకకాలంలో ప్యాసింజర్ సర్వీసులు, కార్గో రవాణా (Adilabad Airport), ఎంఆర్ఓ (మరమ్మత్తులు, నిర్వహణ) సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సదుపాయాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా అత్యంత వేగవంతం కానుంది. అంతేకాకుండా, వ్యాపార, వాణిజ్య పరంగా, పర్యాటక రంగానికి ఊతం లభించడమే కాకుండా, స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
రేవంత్ రెడ్డి చొరవ & డెడ్‌లైన్ ఖరారు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ కారణంగానే ఈ సుదీర్ఘ కల నెరవేరుతోందని మంత్రి గుర్తుచేశారు. ఈ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియతో పాటు, ప్రాథమిక మౌలిక వసతుల మార్పిడి పనులన్నింటినీ 2026 డిసెంబర్ 31 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఇది తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
