Avengers Endgame: Encore : ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది.. అవెంజర్స్: డూమ్స్‌డే స్పెషల్ గ్లింప్స్ కూడా..
అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. (Avengers Endgame: Encore)
Avengers Endgame: Encore
Avengers Endgame: Encore : 2019లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి మరికొన్ని సీన్స్ జతచేసి రీ రిలీజ్ చేయబోతున్నారు. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరిట సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఇండియాలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే దీని తర్వాత వచ్చే అవెంజర్స్ డూమ్స్ డే సినిమాకు సంబంధించి కొన్ని స్పెషల్ సీన్స్ కూడా ఈ రీ రిలీజ్ కి జత చేయనున్నట్టు ప్రకటించింది మార్వెల్ స్టూడియోస్. దీంతో ఈ రీ రిలీజ్ పై మర్వెల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
మార్వెల్‌లో అతిపెద్ద ఈవెంట్, 22 సినిమాల్లో కొనసాగిన కథలు, పాత్రలను ఒకే సినిమాలో కలిపిన ఘనత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. అలాంటి సినిమాను మరోసారి పెద్ద తెరపై చూడటం ద్వారా ఆ భారీ అనుభూతిని మళ్లీ ఆస్వాదించవచ్చు. ఎండ్‌గేమ్ లో కెప్టెన్ అమెరికా, థానోస్‌తో పోరాడే సన్నివేశం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్‌గా నిలిచింది. అవెంజర్స్ హీరోలు ఒక్కొక్కరుగా రావడం కూడా హైలెట్. బ్లాక్ విడో నటాషా రోమానోఫ్ త్యాగం ‘ఎండ్‌గేమ్’లో భావోద్వేగభరితమైన ఘట్టాల్లో ఒకటి. ఎండ్‌గేమ్ లో టోనీ స్టార్క్ (ఐరన్ మ్యాన్)కు వీడ్కోలు భావోద్వేగం ఉంటుంది. ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్‌కు ఇది ముగింపు. ఇప్పుడు ఆయన మళ్లీ MCUలో డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించబోతుండటంతో ఎండ్‌గేమ్ రీ రిలీజ్ ని మరోసారి చూడాలని ట్రై చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఎండ్‌గేమ్: ఎంకోర్ లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ సీన్స్ చూపించబోతున్నారు.
