Adilabad RIMS Tragedy: ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. SNCUలో షార్ట్ సర్క్యూట్.. 27 మంది శిశువులకు గాయాలు, పసికందు మృతి
ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల (Adilabad RIMS Tragedy)లోని చిన్నపిల్లల తీవ్ర సంరక్షణ విభాగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Adilabad rims hospital sncu ward fire short circuit infant death
Adilabad RIMS Tragedy: ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల (Adilabad RIMS Tragedy)లోని చిన్నపిల్లల తీవ్ర సంరక్షణ విభాగాలు ఎంతటి అభద్రతా వాతావరణంలో నడుస్తున్నాయో తెలియజేసే తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) వార్డులో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. వార్డులోని ఎయిర్ కండిషనర్ (ఏసీ) నుంచి పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో, అక్కడ చికిత్స పొందుతున్న నవజాత శిశువుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో తమ పిల్లలను గుండెలకు హత్తుకుని ఆసుపత్రి ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపివేసి ఉపశమన చర్యలు ప్రారంభించారు.
క్షతగాత్రులైన 27 మంది శిశువులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు:
ఈ ప్రమాదం తీవ్రత దృష్ట్యా వార్డులో ఉన్న 27 మంది శిశువులకు గాయాలు కాగా, వారిని అత్యవసరంగా స్థానిక సురక్ష ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పసికందుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దురదృష్టవశాత్తూ, ఇచ్చోడ మండలానికి చెందిన ఐదు రోజుల పిసికందు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా:
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు, ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల వార్డుల్లో భద్రతా లోపాలపై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
