AP Cyclone Alert: కోస్తాంధ్రకు వాయుగుండం ముప్పు.. శ్రీకాకుళను తాకిన తుఫాన్ ఎఫెక్ట్.. అత్యవసర కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి రానున్న 24 గంటల్లో తీవ్ర(AP Cyclone Alert) వాయుగుండంగా మారనుంది.
Andhra pradesh cyclone alert srikakulam on red alert as depression intensifies
AP Cyclone Alert: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి తూర్పున 410 కి.మీ, గోపాల్‌పూర్‌కు 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 23 రాత్రి నుండి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య విశాఖ – గోపాల్పూర్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లా అయిన శ్రీకాకుళంలో ఇప్పటికే తుఫాన్(AP Cyclone Alert) ప్రభావంతో మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎచ్చెర్ల, రణస్థలం, గార వంటి 11 తీరప్రాంత మండలాల సమీపంలో ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది.
శ్రీకాకుళంలో అత్యవసర చర్యలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు:
పరిస్థితి తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ (08942-240557)ను ఏర్పాటు చేశారు. 11 తీరప్రాంత మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించడంతో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. సిబ్బంది అందరూ సచివాలయాలు, మండల కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సరిహద్దు నదులైన వంశధార, నాగావళి నీటి ప్రవాహాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. మత్స్యకారులకు నిషేధం:
తీరం వెంట గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద ఎవరూ నిలబడవద్దని హెచ్చరించారు. ఈ నెల 26వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
