ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేసేందుకు సిద్ధపడిన రైతులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రైతులందరూ నియంత్రిత పద్ధతిలో సాగు చేసేందుకు సిద్ధపడిన వేళ వారి ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగికి కూడా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ మేరకు నియంత్రిత పంటల సాగు అమలు, రైతు బంధు పథకాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం (జూన్ 15, 2020) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగుపై సమీక్షించారు.
ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతులు పంటలు వేస్తున్నారని, ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందన్నారు. రైతులందరూ ప్రభుత్వం సూచించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు అంగీకరించారని తెలిపారు. దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయమన్నారు.
మార్కెట్ లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించింది. రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందుకు వెంటనే రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారం, పది రోజుల్లోగా రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతు బంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులు ముమ్మరం చేయాలని రైతులకు సూచించారు.
వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందిచినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలో రైతులకు మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంటు సాగు జరిగిందని సీఎం వెల్లడించారు.
ప్రాజెక్టులు, మంచి వర్షాల వల్ల ఈ సారి మరో 12 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఏర్పడిందని చెప్పారు. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలన్నారు. 45 లక్షల ఎకరాల్లో వరి, ఏడు లక్షల ఎకరాల్లో మక్కలు వేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 4 లక్షల ఎకరాల్లో శనగలు, 5 లక్షల ఎకరాల్లో వేరు శనగలు వేసుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. 1.5 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.