Sai Krishna Case : సాయికృష్ణ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. బాడీని మాయం చేసింది వీళ్లే!

Sai Krishna Case : సాయికృష్ణ లాకప్‌డెత్ సిట్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మాయం చేసింది ఇద్దరు కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడుగా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Sai Krishna Case New details emerge during SIT investigation

Sai Krishna Case : ఏపీలో రాజకీయ దుమారం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసినట్లు సిట్ అధికారులు కోర్టుకు అందించిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించగా.. ఈ కేసును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేయటానికి సీఐ నాగరాజుకు సహరించింది ఎవరు.. మృతదేహాన్ని ఎక్కడకు తరలించారు అనే విషయాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read : Tadipatri : తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. భారీ బదోబస్తు

సాయికృష్ణ లాకప్‌డెత్ సిట్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మాయం చేసింది ఇద్దరు కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడుగా పేర్కొన్నారు. సీఐ అరెస్టు తరువాత ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సీఐ నాగరాజుకు అసిస్టెంట్‌గా హెడ్ కానిస్టేబుల్ అశోక్, సీఐ పేరుతో ప్రైవేట్ వ్యవహారాలు నడిపిన కానిస్టేబుల్ నాని, సీఐ స్నేహితుడు సురేష్ సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసిన వ్యక్తుల్లో ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు.

గతనెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను సీఐ స్నేహితుడు సురేష్ సెటిల్‌మెంట్‌కు పిలిచినట్లు గుర్తించారు. కానిస్టేబుళ్లు అశోక్, నానితో కలిసి సురేష్ సాయికృష్ణ మేనమామ వద్దకు వెళ్లాడు. ఇదే విషయాన్ని సిట్ అధికారుల విచారణలో నవరంగ్ తెలిపాడు. సాయికృష్ణ మృతదేహంను మాయం చేయడంలో సీఐతో కలిసి అశోక్, నాని, సురేష్ కీలకంగా పనిచేసినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే వీరు ముగ్గురు పరారీలో ఉండగా.. వారికోసం అధికారులు గాలింపు చేపట్టారు. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.

మరోవైపు.. కృష్ణలంక స్టేషన్‌లో మొత్తం 60మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ సిట్ బృందం ప్రశ్నిస్తోంది. సాయికృష్ణ మృతి ఘటన, మృతదేహం మాయం వ్యవహారంలో ఏం జరిగింది? ఎవరి పాత్ర ఉంది? ఈ విషయం మీకెప్పుడు తెలిసింది? అనే విషయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి అన్ని కోణాల్లో సిట్ అధికారులు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.