Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. భవనం కూల్చివేత పనులు వాయిదా, పూర్తిగా శిథిలాలు తొలగించాకే..
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ వింగ్ అధికారులు, సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు.
- Naveen
- Published On : January 21, 2023 / 06:03 PM IST
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ వింగ్ అధికారులు, సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రమాదంలో అదృశ్యమైన ముగ్గురిలో ఒకరి మృతదేహం లభించగా, మరో ఇద్దరి మృతదేహాల కోసం భవనంలోని ప్రతి ఫ్లోర్ ను గాలిస్తున్నారు.
భవనం మొదటి అంతస్తులో శిథిలాలను తొలగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అస్థిపంజారాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజున గుజరాత్ కు చెందిన వసీమ్, జునైద్, జహీర్ భవనంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. అయితే, భవనంలో లభించిన అస్థిపంజరం ఆ ముగ్గురిలో ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.
మొత్తం 25 మంది సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. రెండు, మూడు ఫ్లోర్ లలో బ్యాక్ సైడ్, స్లాబ్ కూలిపోవడంతో జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలని సిబ్బందికి సూచించారు ఉన్నతాధికారులు. బిల్డింగ్ లోపల శిథిలాలు, బూడిద మొత్తం తొలగించిన తర్వాత నిపుణులు మరోసారి స్టడీ చేసి ఫైనల్ గా నివేదికను ఇవ్వనున్నారు.
Also Read..Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన.. ఒక మృతదేహం లభ్యం
అటు భవనం కూల్చివేత పనులను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. పూర్తిగా శిథిలాలు తొలగించాలని నిర్ణయించారు. శిథిలాలు తొలగిస్తే మిగతా వారి ఆచూకీ తెలుస్తుందని అంచనా వేశారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించారు. ఈ నెల 25న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అనుమతులు లేని బిల్డింగ్ లను ఏం చేయాలి అనే దానిపై కమిటీ వేయాలన్నారు తలసాని.
రాంగోపాల్ పేట మినిస్టర్ రోడ్డులో ఉన్న ఆరు అంతస్తుల డెక్కన్ మాల్ భవనం అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు సెల్లార్లతో కూడిన జి+5 భవనంలోని డెక్కన్ స్పోర్ట్స్ నిట్‌వేర్ మాల్‌లో గురువారం(జనవరి 19) ఉదయం 10.30 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వరకూ మంటలు కొనసాగాయి. చుట్టుపక్కల సుమారు 20 భవనాలపై ప్రభావం పడింది. వందల మంది ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేసి పరుగులు తీశారు. డెక్కన్ మాల్‌కు ఎడమవైపు ఉన్న నల్లగడ్డ బస్తీలోని 20 ఇళ్లు మంటల ధాటికి స్వల్పంగా దెబ్బతిన్నాయి.
డెక్కన్ స్పోర్ట్స్ నిట్‌వేర్ మాల్ అగ్నిప్రమాదం ఘటనలో సంస్థలో పనిచేసే వసీం(36), జునైద్ (32), జహీర్(22)లు కనిపించకుండా పోయారు. భవన యజమానులు మహ్మద్ ఒవైసీ, ఎంఏ రహీం తదితరుల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.
ఓ సెల్లార్‌లో స్పోర్ట్స్ డ్రెస్ ల తయారీ యూనిట్ ఉంది. మరో సెల్లార్‌లో కార్ల డెకరేషన్ దుకాణం నడుస్తోంది. టన్నుల కొద్దీ దుస్తులను యజమాని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచి అమ్ముతున్నారు. ఒకటి, రెండు అంతస్తులను వస్త్ర గోడౌన్ గా ఉపయోగిస్తున్నారు. 3వ అంతస్తును ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 4, 5 అంతస్తులను నివాసంగా వాడుకునేందుకు ఇటీవల పనులు చేపట్టారు. సెల్లార్‌లోని వస్త్రాల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా.
