CP Sajjanar : ఐపీఎల్ ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు.. వెంటనే ఫిర్యాదు చేయాలంటూ విజ్ఞప్తి..

CP Sajjanar : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించండి. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

CP Sajjanar

  • బెట్టింగ్‌కు దూరంగా ఉండండి.
  • ఐపీఎల్‌ ప్రారంభం వేళ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక
  • బెట్టింగ్ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి

CP Sajjanar : ఐపీఎల్ 2026 సీజ‌న్ శనివారం నుంచి ప్రారంభమైంది. మే 31న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దాదాపు రెండు నెలలు జరిగే ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రియులకు వేసవిలో వినోదాన్ని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Virat Kohli : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. అరుదైన రికార్డుపై కోహ్లీ క‌న్ను..

ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ ప్రేమికులకు సందడే కాదు.. బెట్టింగ్ రాయుళ్లకూ పండగే. ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతీ మ్యాచ్‌కు.. బంతి బంతికి జోరుగా బెట్టింగ్‌లు నడుస్తుంటాయి. లక్షలు, కోట్లలో బెట్టింగ్ బిజినెస్ జరుగుతుంది. చాలామంది ఈ బెట్టింగ్‌లలో నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత అనేక మంది బెట్టింగ్‌ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారు.

సజ్జనార్ ట్వీట్ ప్రకారం.. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించండి. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బుకోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.

ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపైనా మా ప్రత్యేక నిఘా ఉందని సజ్జనార్ అన్నారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్క్షప్తి చేశారు.