Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణి లావాదేవీలపై విచారణకు సిట్‌.. రైతులకు కీలక విజ్ఞప్తి..

Telangana Cabinet Meeting : భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాం (సిట్) ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.

Also Read : Covid Health Insurance : మళ్లీ కోవిడ్ కలకలం.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి!

భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిపారు. ధరణి పోర్టల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి మొదలు ఇటీవల వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలపై విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికైన సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు సంబంధించి జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు మంత్రిమండలి ఆమోదం ముద్ర వేసినట్టు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై మంత్రిమండలి సుధీర్ఘంగా చర్చించింది.

తీవ్ర వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని భావించింది. అలాగే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది. ఈరోజు వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం నమోదు కాలేదని మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు చేసే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించింది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది. తాగునీరు, విద్యుత్‌కు ప్రాధాన్యతనివ్వాలని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతాంగానికి మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.

అదేవిధంగా వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ నెల 20న జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు అందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా తలెత్తిన పరిస్థితులు, జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది.

అదేవిధంగా.. విద్యాశాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డిలో భూముల కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పులకు ఆమోద ముద్ర వేసింది.