Telangana : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో, జెప్టో అన్నీ బంద్!
Telangana Gig Workers Strike : హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8 నుంచి రవాణా, డెలివరీ సేవలు పూర్తిగా స్తంభిచిపోనున్నారు.
- Harish Thanniru
- Updated on- August 7, 2026 / 02:35 PM IST
Telangana Gig Workers Strike Government Meeting Ola Uber Swiggy Zomato
Telangana Gig Workers Strike : హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి రవాణా, డెలివరీ సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.
గిగ్ కార్మిక సంఘాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను ప్రభుత్వం, కంపెనీల ముందు ఉంచాయి. డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములకు చెల్లించే చార్జీలను తక్షణమే పెంచాలని, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టానికి సంబంధించిన నిబంధనలు అమలు చేసి వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. అలాగే 2020, 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.
అదేవిధంగా, ఫుడ్ డెలివరీ యాప్‌లలో అమలు చేస్తున్న 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం, కంపెనీలు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈ సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్ సేవలు, ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదిలాంటే శనివారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర సంస్థల ప్రతినిధులతో అత్యవసర సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంబంధిత కంపెనీలు తమ అధికార ప్రతినిధులతో పాటు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరం సమర్పించిన వినతుల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. సమ్మెకు ముందు ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న చివరి సమావేశం ఇదేనని, దీని ఫలితాన్ని బట్టి లక్షలాది యాప్ ఆధారిత క్యాబ్, ఆటో డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారని చెప్పారు.
