Telangana Engineering Colleges fees
Engineering Colleges fees : ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరం ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఫీజు రూ.1.83లక్షలు ఉండగా.. కనిష్ఠ ఫీజు రూ.45వేలుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి మూడేళ్లకొకసారి ఈ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది. చివరిసారిగా 2022-23లో ఫీజులు నిర్ణయించారు. అయితే, కొత్త ఫీజులను గతేడాది నిర్ణయించాల్సి ఉండగా.. ఈ ఏడాదికి వాయిదా వేశారు. తాజాగా.. రాష్ట్ర ఉన్న విద్యాశాఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈసారి 69 కాలేజీల ఫీజులు రూ.50వేల నుంచి రూ.62వేల మేర పెరిగాయి. 70 కాలేజీల్లో పాత ఫీజులనే కొనసాగించారు. 19 కాలేజీల్లో.. ఫీజులను 3,500 నుంచి రూ.45వేల దాకా తగ్గించారు. దీంతో మొత్తం 35 కాలేజీల్లో ఫీజు రూ.లక్షపైన ఉండగా.. 33 కాలేజీల్లో రూ.50వేల లోపు ఫీజులున్నాయి. 92 కాలేజీల్లో ఫీజు రూ.50వేల నుంచి రూ.లక్షలోపు ఉంది.
అత్యధిక ఫీజులున్న టాప్-20 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..
సీబీఐటీ (1,83,000), వాసవి (1,75,000), ఎంజీటీ (1,67,000), సీవీఆర్ (1,63,000), జి.నారాయణమ్మ (1,62,000), గోకరాజు రంగరాజు (1,60,500), వీఎస్ఆర్ విజ్ఞానజ్యోతి (1,59,600), బీవీఆర్ ఐటీ (1,46,600), కిట్స్ వరంగల్ (1,46,200), ఎంవీఎస్ఆర్ (1,43,800), బీపీఆర్ఐటీ మహిళా కాలేజ్ (1,43,500), ఎస్ఆర్ యునివర్సిటీ (1,41,000), వర్థమాన్ కాలేజీ (1,40,000), శ్రీదేవి మహిళా కాలేజీ (1,37,000), శ్రీవర (1,33,000), కేశవ్ మెమోరియల్ (1,29,200), గురునానక్ (1,29,000), ముఫకమ్జా (1,25,000), విజ్ఞాన్ (1,23,000), గీతాంజలి (1,21,000).