×
Ad

Rythu Bharosa : రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుల ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే.. వారికి మాత్రం షాక్..

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. సాగులో ఉన్న భూములకే పథకం వర్తించేలా చర్యలు వేగవంతం చేస్తోంది.

Rythu Bharosa

  • రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
  • సాగులో ఉన్న భూములకే రైతు భరోసా
  • శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం
  • వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం

Rythu Bharosa : వానాకాలం, యాసంగి పంటల సాగు సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ ‘రైతు భరోసా’ పేరిట అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఆ నగదు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, రైతుభరోసా డబ్బులు ఎప్పుడు పడతాయనే అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.. కానీ, తాజాగా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : Telangana Congress: మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులే ట్విస్టులు.. వికారాబాద్, అలంపూర్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..!

రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికీ కాకుండా, వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది.

కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8-12శాతం సాగులో తేడా (20లక్షల ఎకరాలు) కనిపిస్తున్నట్లు తెలిసింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్యభూమి ఉంటే.. 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి. అయితే, ఈ శాటిలైట్ మ్యాపింగ్ తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడనుంది.

సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని, గ్రామాల్లో సర్వే నెంబర్లవారీగా ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి కచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం. అగ్రికల్చర్ యూనివర్శిటీ రూపొందించిన పంట వివరాలను ఈనెల 14 తరువాత ప్రభుత్వానికి అందిస్తే.. టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.