Telangana Congress: మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులే ట్విస్టులు.. వికారాబాద్, అలంపూర్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..!
వికారాబాద్, అలంపూర్ ఎపిసోడ్‌తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పని చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
Congress Representative Image (Image Credit To Original Source)
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇంట్రెస్ట్రింగ్ పరిణామాలు
- వికారాబాద్, అలంపూర్‌లో ఒక్కో సీటు ఏకగీవ్రం
- యునానిమస్‌గా గెలిచిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం
Telangana Congress: వార్ వన్ సైడే. పురపోరులో మనదే హవా. బీఆర్ఎస్ కంచుకోటను కూడా బద్దలు కావాల్సిందే. హస్తం పార్టీ లీడర్లకు..కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన డైరెక్షన్స్ ఇవి. కానీ రెండు మున్సిపాలిటీల్లో యునానిమస్ గేమ్..అధికార పార్టీకి షాక్ ఇచ్చిందట. ఆ రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకపోవడంతో.. కంగుతిన్నారట కాంగ్రెస్ నేతలు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన లీడర్లు..కారు లీడర్లకు గాలం వేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ రెండు మున్సిపాలిటీల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పెద్దలు ఎందుకంత రియాక్ట్ అయ్యారు?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇంట్రెస్ట్రింగ్ పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. పురపోరులో సత్తా చాటేందుకు..సీఎం రేవంత్‌తో సహా మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. అలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీస్‌లో రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలవలేదు. అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయకపోవడంతో..బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉలిక్కిపడిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం..
ఇక వికారాబాద్ మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయలేదు. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి యునానిమస్‌గా గెలిచారు. మున్సిపాలిటీలలో అన్ని చోట్ల వందకు వంద శాతం గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే.. ఇలా జరిగిందేంటని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఉలిక్కి పడింది. ఈ రెండు కూడా కాంగ్రెస్ కీలక నేతల నియోజకవర్గాలు కావడంతో హస్తం పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారట.
వికారాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా..అలంపూర్ నియోజకవర్గ నుంచి ఏఐసీపీ కీలక నేత సంపత్ కుమార్ ఉన్నారు. ఇద్దరు ముఖ్య నేతలున్న చోట రెండు సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఏంటని ఆరా తీశారట. కీలక నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారట.
వికారాబాద్ లో ఆపరేషన్ సక్సెస్..
అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవ అయ్యారు. అతడిన చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా..అక్కడ బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి ఉండటంతో హస్తం పార్టీ నేతలు ఎత్తులు వర్కౌట్ కాలేదట. ఇక వికారాబాద్‌లో కాంగ్రెస్ తనదైన మార్క్ చూపించింది. వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరఫున ఏకగ్రీవమైన కౌన్సిలర్‌ను రాత్రికి రాత్రి కాంగ్రెస్ వైపు తిప్పుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు రచించిన ఆపరేషన్ వికారాబాద్‌లో సక్సెస్ అయింది. వికారాబాద్‌లో జరిగిన ఎపిసోడ్ తో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
వికారాబాద్, అలంపూర్ ఎపిసోడ్‌తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పని చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట. బీఆర్ఎస్కు పట్టున్న చోట పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. పురపోరులో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: రసవత్తరంగా పురపోరు.. పార్టీల ఎత్తుకు పైఎత్తులు.. పొలిటికల్ గేమ్‌లో పైచేయి సాధించేదెవరు?
