Metro TSRTC Combo Pass : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి పాస్ రూ.4వేలకు తగ్గింపు.. కానీ, బిగ్‌ట్విస్ట్ ఏమిటంటే?
Metro TSRTC Combo Pass : హైదరాబాద్ మహానగరంలో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.
- Harish Thanniru
- Published on- November 6, 2026 / 10:24 AM IST
Metro TSRTC Combo Pass
Metro TSRTC Combo Pass : హైదరాబాద్ మహానగరంలో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ల ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read : Telangana government : తెలంగాణలో మరో కొత్త పథకం..! ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు
మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు ఊరట కల్పించింది. నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ప్రస్తుతం రూ.8,500గా ఉంది. అయితే, నెలవారీ పాస్ ధరను ఏకంగా రూ.4,500 తగ్గించిన ప్రభుత్వం.. కొత్తగా రూ.4,000గా నిర్ణయించింది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.3,000, ఆర్టీసీ ప్రయాణానికి రూ.1,000 కేటాయించారు. అయితే, ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే ఈ పాస్ ద్వారా నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులు చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రోజువారీ ఉమ్మడి పాస్ ధర రూ.400గా ఉంది. దీనిని తాజాగా.. రూ.275కు తగ్గించింది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు రోజుకు గరిష్ఠంగా నాలుగు సింగిల్ జర్నీలు చేయవచ్చు. ధర తగ్గింపుతో ఒక్కో పాస్‌పై ప్రయాణికులకు రూ.125 ఆదా అవుతుంది.
కొత్త ధరల అమలుతో రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125, నెలవారీ పాస్ వినియోగదారులకు రూ.4,500 వరకు ఆదా కానుంది. ముఖ్యంగా ప్రతిరోజూ మెట్రో, ఆర్టీసీ బస్సులను ఉపయోగించి కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉండనుంది.
గత నెల రోజుల క్రితం మెట్రో, బస్సు ఉమ్మడి పాస్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం నెలవారి పాస్ కు రూ.8,500గా నిర్ణయించారు. దీంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత భారీ మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రయాణికులు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. దీంతో అధికారులు పలు దఫాలుగా సమీక్షల అనంతరం నెలావారి ఉమ్మడి పాస్ ధరను రూ.4వేలకు తగ్గించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం నుంచి ఇందుకోసం గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా.. మెట్రో – బస్సు ఉమ్మడి పాస్ నెలవారి, రోజువారి ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
