Paraquat Dichloride: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అత్యంత ప్రమాదకరమైన ఆ గడ్డి మందుపై నిషేధం
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
- Naveen
- Published On : April 1, 2026 / 06:57 PM IST
Paraquat Dichloride: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై నిషేధం విధించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ గడ్డి మందు వినియోగం, విక్రయాలపై నిషేధం విధిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పారాక్వాట్ అమ్మకాలు, వాడకంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గడ్డి మందు నిషేధంపై ఇటీవలే లోక్ సభలో ప్రస్తావించారు ఎంపీ కడియం కావ్య.
ఈ గడ్డి మందు అత్యంత ప్రమాదకరంగా మారింది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. దీని వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గడ్డి మందుపై కేంద్రం శాశ్వత నిషేధం విధించాలని అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసింది.
ఏంటీ గడ్డి మందు? ఎందుకు ప్రమాదకరం?
పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు. కలుపు నివారణకు వాడతారు. అయితే, దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గడ్డి మందును పిచికారీ చేస్తున్నారు. ఈ మందు పొరపాటున గాలి ద్వారా శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాలతో కూడిన కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. ఇది అనర్ధాలకు దారితీస్తోందని నిపుణులు వాపోతున్నారు. అనాలోచితంగా పంట భూములకు వాడటం వల్ల కలుపుతో పాటు భూమిలో పంటకు మేలు చేసే జీవరాశి కూడా అంతమై పంట పొలాలు నిర్జీవమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందవని వివరించారు. సాగు, తాగు నీటి వనరులు, నేల నిర్మాణం పాడైపోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డి మందు అవసరమైతేనే వాడాలని సూచిస్తున్నారు. అంతేకాదు తప్పనిసరిగా నిపుణుల సూచనలు తీసుకోవాలని చెబుతున్నారు.
రసాయన పురుగు మందు పారాక్వాట్ వల్ల మనుషుల ఆరోగ్యం, జంతువులపై కలిగే దుష్ప్రభావాలపై వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు, నివేదికలు అందాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యం, రైతుల భద్రత కోసం 1968 పురుగుమందుల చట్టంలోని సెక్షన్ 27 కింద అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వు జారీ చేసింది.
