Degree Students FRS: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఇక కాలేజీలో ముఖం చూపిస్తేనే.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు
Degree Students FRS : డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బందికి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది.
in telangana facial recognition attendance system introduced for degree and polytechnic colleges
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తో హాజరు
- ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
Degree Students FRS : ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కళాశాల విద్యాశాఖ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నారు. విద్యార్థులతో పాటు లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు కోసం ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇకపై ఇప్పటివరకు అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలకనున్నారు.
విద్యాశాఖ రూపొందించిన అటెండెన్స్ యాప్లో రిజిస్టర్ చేసి, దాని ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 1, బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్ కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అధికారికంగా అమలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం సుమారు లక్షన్నర మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులతో పాటు లెక్చరర్లు, ఇతర సిబ్బంది ఫేస్ స్కాన్ ద్వారా హాజరు వేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
కొన్నాళ్లుగా కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని సార్లు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, మెషిన్ల వద్ద రద్దీ, టెక్నికల్ లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సమస్యలకు చెక్ పెడుతూ ఫేషియల్ రికగ్నిషన్ వైపు అధికారులు దృష్టి సారించారు.
ఈ కొత్త పద్ధతిలో విద్యార్థులు, సిబ్బంది తమ స్మార్ట్ఫోన్ ద్వారా యాప్లో ముఖాన్ని స్కాన్ చేస్తే హాజరు నమోదవుతుంది. ఈ విధానం వల్ల ఇకపై విద్యార్థులకు మంజూరు చేసే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, సర్కారు నిధుల దుర్వినియోగాన్ని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా..
డిగ్రీ కాలేజీలతో పాటు.. పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా విద్యార్థులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది హాజరు కోసం ఎఫ్ఆర్ఎస్ (FRS) విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
