Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక వారందరికీ సొంత ఇళ్లు రాబోతున్నాయ్.. హైదరాబాద్‌సహా ఆ జిల్లాల్లో కేటాయింపులు..
Telangana Govt : స్టిల్ట్ పద్దతిలో నిర్మించే బహుళ అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లలో గదులు ఉండవు. ఇక్కడ వాహనాల పార్కింగ్, వాణిజ్య సముదాయాల గదులను నిర్మిస్తారు. జీప్లస్3 విధానంలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌లో గదులను నిర్మించి ఇస్తారు.
- Harishth Thanniru
- Published On : April 3, 2026 / 07:47 AM IST
Telangana Govt
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- స్థలాలు లేని లబ్ధిదారులకు ఫ్లాట్‌లు
- హైదరాబాద్ సహా జిల్లాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం
Telangana Govt : రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణంకోసం ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత జాగా ఉండి అర్హులైన వారికి ప్రభుత్వం మూడు విడతల్లో రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే లక్షకుపైగా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి అయ్యాయి. చాలా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్థలాల లభ్యత ఉన్నచోట ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకోసం స్టిల్ట్+9, స్టిల్ట్+5, జీ+3 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సుమారు 415 నుంచి 500 చదరపు అదుగుల మధ్యలో రెండు పడకల గదుల ఇళ్లు ఉండేలా ఆకృతులను రూపొందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ఐదు మురికి వాడలను.. వాంబే, ఈడబ్ల్యూఎస్ పథకాల కింద నిర్మించి శిథిలావస్థకు చేరిన మరో 12 కాలనీలను అధికారులు గుర్తించారు.
స్టిల్ట్ పద్దతిలో నిర్మించే బహుళ అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లలో గదులు ఉండవు. ఇక్కడ వాహనాల పార్కింగ్, వాణిజ్య సముదాయాల గదులను నిర్మిస్తారు. జీప్లస్3 విధానంలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌లో గదులను నిర్మించి ఇస్తారు. ఎకరానికి స్టిల్ట్ ప్లస్ 9 అంతస్తుల్లో 200 నుంచి 220 ప్లాట్లు, స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల్లో 150 నుంచి 200 ప్లాట్లు, జీప్లస్3 విధానంలో 120 నుంచి 150 ప్లాట్లు నిర్మించడానికి సాధ్యమవుతోంది.
హైదరాబాద్ నగరంతోపాటు హైదరాబాద్ శివారు జిల్లాలైన మేడ్చల్ జిల్లాలో 28 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్రిశాట్ వద్ద ఐదు ఎకరాలు, మార్క్స్ నగర్ లో ఆరు ఎకరాల్లో, లక్డారంలో 130 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాక.. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, అదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోసైతం స్టిల్ట్ పద్దతిలో ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 77.68 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. వీరిలో అర్హత ఉండి స్థలాలులేని దరఖాస్తుదారులు 2.14లక్షల మంది ఉన్నారు. వీరందరిని ఎల్-2 జాబితాలో చేర్చారు. ఇప్పుడు ఎల్-2 జాబితాలోని పేదలకోసం అపార్టుమెంట్లు నిర్మించి ప్లాట్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు తయారు చేశారు. ఒకేచోట భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించి.. అందులో లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
