Hyderabad Ropeway : ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఇక ఆకాశ మార్గంలో హాయిగా వెళ్లిపోవచ్చు..

Hyderabad Ropeway : నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Telangana government plans ropeway network for public transport in hyderabad

Hyderabad Ropeway : హైదరాబాద్ నగరవాసులను ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య ట్రాఫిక్. మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటలు దాటిన తర్వాత నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇళ్లకు, ఆఫీసులకు చేరుకోవాలంటే గంటల సమయం పడుతుంది. మన దురదృష్టం కొద్దీ వర్షం వచ్చిందంటే ఇంక అంతే.. రోడ్ల మీదే పడిగాపులు కాయాలి. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్.. అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగానే రేవంత్ సర్కార్ ఓ వినూత్న ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. అదే రోప్‌వేల వినియోగం.

రోప్‌వే.. అనగానే అందరికీ కొండలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. కానీ ఇక మీదట ఇవి హైదరాబాద్ నగరంలో దర్శనం ఇవ్వబోతున్నాయి. అది కూడా ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా. దేశంలోనే ప్రథమంగా.. వారణాసిలో తొలి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు రోప్‌వే వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఇదే ‘వారణాసి మోడల్‌’ను హైదరాబాద్‌ నగరంలో కూడా ప్రవేశపెట్టేందుకు యూనిఫైడ్‌ మెట్రోపాలిటిన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (UMTA) కార్యాచరణ రూపకరణ చేస్తోంది.

ఈ రోప్‌వేలను నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, వ్యాపార సముదాయాలకు, ఒక పర్యాటక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ప్రత్యేక “రోప్‌వే సర్క్యూట్”లను ఏర్పాటు చేయనున్నారు. అలానే వీటి నిర్వహణ కోసం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నిర్మించాలని యోచిస్తున్నారు.

నగరంలో ప్రతిపాదిత రూట్లు:

  • గోల్కొండ టు టూంబ్స్: ముందుగా నగరంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు.
  • గోల్కొండ నుంచి జూ పార్క్: గోల్కొండ ప్రాంతం నుండి నెహ్రూ జూ పార్క్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ఏరియల్ వ్యూతో రోప్‌వేలను అనుసంధానం చేసే అవకాశం ఉంది.
  • ట్యాంక్‌బండ్-సంజీవయ్య పార్క్: హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్యాంక్‌బండ్‌ నుంచి సంజీవయ్య పార్కు వరకు కూడా రోప్‌వే నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
  • ఐటీ కారిడార్: నగరంలోని ఐటీ హబ్ (హైటెక్ సిటీ, గచ్చిబౌలి) ప్రాంతాల్లో కూడా దీని సేవలను వాడుకునే వీలుంది.
  • అనుమతులు: ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), రక్షణ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ల కొరకు హెచ్‌ఎండీఏ ప్రయత్నిస్తోంది.

రోప్‌వే వల్ల కలిగే ప్రయోజనాలు:

సమయం ఆదా:

ఇప్పటికే వారణాసిలో రోప్‌వేలు అందుబాటులో ఉండగా.. అక్కడ రోడ్డు మార్గంలో 45 నిమిషాల నుంచి గంట పట్టే ప్రయాణ సమయం.. ఈ రోప్‌వే ద్వారా కేవలం 16 నిమిషాలకే తగ్గిపోతోంది. ఇదే విధంగా హైదరాబాద్‌లో కూడా 2-3 కిలోమీటర్ల తక్కువ దూర ప్రయాణాలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ట్రాఫిక్, వర్షాల కష్టాలకు చెక్:

హైదరాబాద్ నగరంలో నిత్యం ఉండే ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, వానాకాలంలో రోడ్లపై నిలిచే నీటి వల్ల పడే ఇబ్బందుల నుంచి వాహనదారులకు పూర్తి స్థాయిలో ఉపశమనం లభిస్తుంది.

సామాన్యుడికి అందుబాటులో:

భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూనే.. టికెట్ రేటును సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచితే ఈ ప్రాజెక్టు అద్భుతమైన విజయం సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.