తమిళిసై…బంగారు తెలంగాణకు సై

గవర్నర్‌ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ అన్నారు.  సోమవారం (సెప్టెంబర్ 9, 2019) రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు.  బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్‌ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా… గణేశ్‌ ఉత్సవాలతో పాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిస్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గంగా జమునా తెహజీబ్‌ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోందన్నారు. 

 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు లాంటి అద్భుత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశారని తెలిపారు. . చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయమన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందన్నారు. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదుగుతోందని తెలిపారు. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయన్నారు.  

ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సుపరిపాలనలో భాగంగా అధికార వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయమన్నారు.