తెలంగాణలో అమల్లోకిరాని యాన్యువల్ టోల్‌పాస్ స్కీమ్.. కారణం ఇదే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాన్యువల్ టోల్‌పాస్ (FASTag annual pass) స్కీమ్ తెలంగాణలో అమల్లోకి రాలేదు.

Annual Toll Pass Scheme
Annual Toll Pass Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాన్యువల్ టోల్‌పాస్ (FASTag annual pass) స్కీమ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. పంద్రాగస్టును పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ టోల్ పాస్‌ను తీసుకొచ్చింది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా అదుబాటులోకి రాలేదు.
యాన్యువల్ టోల్ పాస్ స్కీమ్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. రూ.3వేలు కడితే ఏడాదిలో 200సార్లు ఈ పాస్ ద్వారా టోల్ గేట్లు క్రాస్ అవ్వొచ్చు. సగటున ఒక్కో టోల్‌గేట్ వద్ద రూ.15 కట్ అవుతాయి. ఇప్పటికే ఫాస్టాగ్ కలిగి ఉన్న వాహనదారులు మాత్రమే ఈ పాస్ పొందొచ్చు.
ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాకపోవటానికి కారణం.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ పోర్టల్‌లో తెలంగాణ వెహికల్స్ నమోదు కాకపోవడమే. తెలంగాణ వాహనాలను వాహన్ డేటాబేస్‌లో నమోదు చేయించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణాశాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
చాలా రాష్ట్రాలు తమ వాహనాల సమాచారాన్ని ఇప్పటికే వాహన్ డేటాబేస్ తో అనుసంధానించాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ ఇంకా తన వాహనాల డేటాను పూర్తిగా ఇందులో చేర్చలేదు. ఫలితంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు, రాయితీలు ఇక్కడి వాహనాలకు వర్తించడం లేదు. అయితే, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
వాహన్ డేటాబేస్ అంటే ఏమిటి..?
వాహన్ డేటాబేస్ అంటే.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కేంద్రీకృత వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాబేస్. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు (ఆర్టీవో) నుంచి వాహన్ రిజిస్ట్రేషన్ డేటాను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. వెహికల్ ఓనర్ పేరు, రిజిస్ట్రేషన్ తేదీ, వెహికల్ టైప్, ప్యూయెల్ టైప్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు వంటి అన్ని వివరాలు వాహన్ డేటాబేస్‌లో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా వెహికల్స్ కు సంబంధించిన సమాచారం పరిశీలించడం, ట్యాక్స్ లు, ఫీజులు, పెండింగ్ చలాన్లు వంటి వివరాలను తెలుసుకోవడం ఈజీ అవుతుంది.
ఒక్క రోజే 1.4లక్షల మంది..
దాదాపు 1.4 లక్షల మంది ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు వార్షిక టోల్ పాస్‌ను కొనుగోలు చేశారని, మొదటి రోజు నేషనల్ హైవేలు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాలలో దాదాపు ఇలాంటి లావాదేవీలు నమోదయ్యాయని భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) శుక్రవారం తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుండి టోల్ పాస్ పథకం అమలులోకి వచ్చింది.