రెడ్ అలర్ట్.. రెడ్ అలర్ట్.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు.. అస్సలు బయటకు రావొద్దు.. బీ కేర్ ఫుల్..
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ..

Heavy Rains
Rains: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల పరిధిలో ఇవాళ, రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హనుమకొండ కరీంనగర్ జగిత్యాల్ ఖమ్మం నిర్మల్ పెద్దపల్లి సూర్యాపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ..
హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది.
ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలోనూ..
హైదరాబాద్ నగరంలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. కూకట్ పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రహదారులు జమలయం అయ్యాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్‌సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు.
నగరంలో రెండు రోజులు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో నగర వాసులు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ప్రాజెక్టులకు జలకళ..
తెలంగాణలో నాలుగు రోజులు దంచికొడుతున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నాలుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టుకు బారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 16గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సీఎం రేవంత్ సమీక్ష..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంందాలను ముందుగానే మోహరించాలని సూచించారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిభిరాలకు తరలించాలని ఆదేశించారు.