Telangana Congress: ఎంఐఎంతో జాగ్రత్త..! రాహుల్ కామెంట్స్ వెనుక మర్మమేంటి? సడెన్‌గా ఏమైంది?
రాహుల్ గాంధీనే స్వయంగా ఎంఐఎం విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం విషయంలో మునుముందు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారట.
Rahul Gandhi Representative Image (Image Credit To Original Source)
- తెలంగాణలో కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం
- ఎంఐఎంపై రాహుల్‌కు పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడానికి రీజనేంటి?
- ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ ఆలోచన తీరు మారుతోందా?
- కాంగ్రెస్ పెద్దలు ఎంఐఎంను నమ్మకపోవడానికి కారణమేంటి?
Telangana Congress: ఆ పార్టీ పాతబస్తీలో ఫుల్ స్ట్రాంగ్. అక్కడక్కడ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది పతంగి పార్టీ. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో పట్టున్న పార్టీ. తెలంగాణలో అయితే పవర్లో ఉన్న పార్టీతో వాళ్లు కలుస్తారన్న పేరు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయినా ఆ పార్టీ విషయంలో జాగ్రత్త అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పార్టీతో అతిగా కలిసి ఉంటే పుట్టి మునగడం ఖాయమంటూ హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యనేతలందరినీ ఢిల్లీకి పిలుపించుకుంది హైకమాండ్. రాష్ట్ర మంత్రులందరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
మేము చెప్పేది అర్థం చేసుకోండన్న పార్టీ చీఫ్..
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందిస్తూనే.. కొన్ని హెచ్చరికలు జారీ చేశారట. ముఖ్యంగా పొలిటికల్‌గా వేసే అడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారట. మరీ ముఖ్యంగా ఎంఐఎం విషయంలో కేర్ ఫుల్‌గా ఉండాలని చెప్పారట. ఆల్ ఆఫ్ సడెన్‌గా రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేసే సరికి తెలంగాణ రాష్ట్ర నేతల నోట మాట రాలేదట. ఈ సందర్భంగా ఒకరిద్దరు మంత్రులు కలుగజేసుకొని..సర్..స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి వస్తుందని వివరించబోయారట. వెంటనే పార్టీ ఏఐసీసీ చీఫ్ ఖర్గే కలుగజేసుకొని.. మేము చెప్పేది అర్థం చేసుకోండి..అయినా ఈ విషయంపై తర్వాత మరోసారి వివరంగా చర్చిద్దామంటూ విషయాన్ని అంతటితో క్లోజ్ చేశారట.
ఎంఐఎం విషయంలో రాహుల్ పర్టిక్యులర్‌గా మాట్లాడే సరికి తెలంగాణ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. తెలంగాణలో చాలా చోట్ల దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. దీంతో ముస్లిం వర్గాన్ని పోలరైజ్ చేయగలిగిన ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉంటే.. పొలిటికల్‌గా కలిసి వస్తుందనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది. మొన్నటి జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాస్త కలిసొచ్చిందని భావిస్తున్నారు. నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.
గద్వాల్ మున్సిపాలిటీతో మరికొన్ని చోట్ల ఎంఐఎం మద్దతు తీసుకొని మున్సిపాలిటీలను హస్త గతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే దోస్తీ మునుముందు కూడా కంటిన్యూ చేస్తే..రాజకీయంగా మరింత లాభం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కానీ రాహుల్ గాంధీ ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ కు దూరమవుతున్న ముస్లింలు..
ఎంఐఎం మొన్నటి వరకు తెలంగాణ వరకు మాత్రమే పరిమితమైన పార్టీ. ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీకి నిలుస్తోంది. ఎంఐఎం పోటీ చేస్తుండటంతో ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోతుంది. ముస్లిం ఓటర్లు చాలా చోట్లా ఎంఐఎం పక్షాన నిలుస్తున్నారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ముస్లింలు కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉంటూ..ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి ముస్లిం ఓటు బ్యాంక్..ఈ మధ్య ఎంఐఎం పోటీలో నిలుస్తుండటంతో వారంతా కాంగ్రెస్ నుంచి దూరమవుతున్నారు.
ఎంఐఎంతో బీజేపీకి మేలు..?
మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీతో కాంగ్రెస్‌కు పొలిటికల్‌గా భారీ నష్టం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం పోటీ బరిలో ఉన్నచోట్ల మెజారిటీ హిందువులు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారట. దీంతో ఎంత బలంగా పోరాడినా కాంగ్రెస్‌కు పాజిటివ్ రిజల్ట్స్ రావడం లేదంటున్నారు. ఎంఐఎం.. ఓట్లు చీలుస్తుండటంతో బీజేపీకి మేలు జరుగుతుందని..అందుకే ఎంఐఎం విషయంలో సాఫ్ట్ కార్నర్ వద్దని చెబుతున్నారట రాహుల్.
మారుమూల ప్రాంతాలకు కూడా ఎంఐఎం విస్తరిస్తుండటంతో రాహుల్ ఆందోళన..!
తెలంగాణలో కూడా ఎంఐఎం మొన్నటి వరకు ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ మధ్య ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా బరిలో నిలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం ఎక్కడ ఎక్కువ పోటీ చేస్తుంటే..అక్కడ బీజేపీ అంత బలంగా నిలదొక్కుకుంటుంది. నిజామాబాద్‌లో మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ ఏర్పడింది. మొదటి ఒకటి, రెండు స్థానాల్లో ఈ రెండు పార్టీలే నిలిచాయి. ఎంఐఎం ఆఖరికి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో రాహుల్ గాంధీ ఆందోళన చెందుతున్నారట. ఆఖరికి గద్వాల్ లాంటి చోట్ల ఆ పార్టీ ఖాతా తెరవగలిగింది.
ఇలాంటి పరిణామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారట. ఎంఐఎం ఇలాగే ముందుకు వెళ్తే..తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని హెచ్చరించారట. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంఐఎం విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం విషయంలో మునుముందు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారట. రాహుల్ మాటతో భవిష్యత్‌లో ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ను వదులుకుంటారా..? లేక పొలిటికల్‌గా తప్పని పరిస్థితిలో కలిసి నడుస్తారా అనేది చూడాలి.
Also Read: ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మంత్రి అడ్లూరి..! గురువు మాట జవదాటలేక అవస్థలు..!
