Cheyutha Pension: ‘చేయూత పెన్షన్ల’ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్.. దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణలో చేయూత పింఛన్ల(Cheyutha Pension) కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
- V Santhosh Kumar
- Published on- August 31, 2026 / 07:21 PM IST
Telangana govt extends cheyutha pension application deadline till september 15
- చేయూత పెన్షన్ల గడువు పెంపు
- సెప్టెంబర్ 15 వరకు అవకాశం
- మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
Cheyutha Pension: తెలంగాణలో చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పింఛన్ల(Cheyutha Pension) దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి నేటితో ముగియాల్సిన తుది గడువును వచ్చే నెల 15వ తేదీ (సెప్టెంబర్ 15) వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు సమయం సరిపోక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది పేదలకు, దివ్యాంగులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.
Kalvakuntla Kavitha: నిజామాబాద్ సభలో కవిత తీవ్ర భావోద్వేగం.. వేదికపైనే కంటతడి.. అసలేం జరిగిందంటే?
మంత్రి సీతక్క ఆదేశాలతో నిర్ణయం:
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సదరం (SADAREM) సర్టిఫికెట్ల పొందే ప్రక్రియ ఆలస్యం కావడం, కొత్తగా దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు గడువు పెంచాలని దివ్యాంగులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
అర్హులందరికీ అవకాశం, సెప్టెంబర్ 15 ఆఖరు తేదీ:
పెంపొందించిన గడువు ప్రకారం అర్హులైన వారు సెప్టెంబర్ 15వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సాంకేతిక కారణాలు లేదా సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా సంక్షేమ ఫలాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
