Double Bedroom Houses : ఆ 19 వేల మందికి తెలంగాణ సర్కార్ బిగ్ షాక్.. వారికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లు వెనక్కి
Double Bedroom Houses : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 19 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను రద్దు చేసేందుకు రెడీ అవుతోంది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 12:07 PM IST
telangana govt warns 19000 double bedroom houses to be reallocated if they are unoccupied
Double Bedroom Houses : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 19 వేల మంది లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన వారికి ఈ హెచ్చరికలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను పొందిన వారిలో చాలా మంది నేటికీ వాటిలో నివాసం ఉండటం లేదు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మూడోసారి నోటీసులు పంపేందుకు రెడీ అవుతోంది. అప్పుడు కూడా స్పందించకపోతే.. వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గత రెండు నెలలుగా అధికారులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన సుమారు 19 వేల మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో నివసించడం లేదని గుర్తించారు. దీంతో వెంటనే లబ్ధిదారులందరికీ నోటీసులు జారీ చేస్తూ, వెంటనే ఇళ్లలోకి చేరాలని సూచించారు. కానీ కొందరు మాత్రం అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు.
ఈ క్రమంలో అధికారులు మూడోసారి నోటీసులు పంపి.. మరొక్క అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ సారి కూడా స్పందించకపోతే వారికి కేటాయించిన ఇళ్లను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారులు అధికారుల నోటీసులను పట్టించుకోకుండా వదిలేయడంతో, మూడో సారి నోటీసులు పంపిన తర్వాత కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగించి ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న పేదలకు 2023, ఆగస్టులో.. అప్పటి ప్రభుత్వం నగర శివారులో నిర్మించిన 90 వేల ఇళ్లను కేటాయించింది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ దాదాపు 40 వేల మంది లబ్ధిదారులు వాటిలో చేరేందుకు ఇస్టపడలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లూరు, తూంకుంట, రాంపల్లి, వనస్థలిపురం, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద అన్ని వసతులను ఏర్పాటు చేసింది. అయినా కూడా ఇంకా కొందరు వాటిల్లో చేరలేదు. దీంతో మూడో సారి నోటీసులు ఇచ్చి, అప్పుడు కూడా స్పందించకపోతే ఆ తర్వాత వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని భావిస్తోంది.
